నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

న్యూస్‌రీల్‌

ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్‌ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు.

రెవెన్యూ క్లినిక్‌లు..

భూ వివాదాల పరిష్కారానికి కలెక్టరేట్‌ ఆవరణలో సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. కౌంటర్లలో ఆయా రెవెన్యూ డివిజన్లకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అడంగల్‌ మార్పులు–చేర్పులు, మ్యుటేషన్లు, రస్తా, శ్మశాన వాటిక సమస్యలు, 22ఏ చుక్కల భూములు, సబ్‌ డివిజన్లు, పట్టాదారు పేరు మార్పులు తదితర సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఈ విషయంపై ఆదివారం ఆయా డివిజన్ల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు.

సజావుగా ఫ్లాగ్‌షిప్‌ పరీక్ష

అనంతపురం అర్బన్‌:యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో నిర్వహించిన ఫ్లాగ్‌షిప్‌ (ఎన్‌డీఏ, ఎన్‌ఏ, సీడీఏ) పరీక్ష సజావుగా జరిగింది. పరీక్షలకు 522 మంది అభ్యర్థులకు గానూ 340 మంది హాజరయ్యారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ కేంద్రంలో జరిగిన కంబైన్డ్‌ డిఫెన్స్‌ అకాడమీ (సీడీఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 55 శాతం నమోదైంది. కేఎస్‌ఆర్‌ కళాశాల కేంద్రంలో జరిగిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), నావల్‌ అకాడమీ (ఎన్‌ఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 65.18 శాతం నమోదైంది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ ఆనంద్‌ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement