అనంతపురం ఎడ్యుకేషన్: ‘అనంత’ విద్యార్థినికి జపాన్ దేశం నుంచి పిలుపు వచ్చింది. సైన్స్‌లో కనబరచిన ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించింది. గుంతకల్లు మండలం కసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసి ప్రస్తుతం ఇడుపులపాయలో ఇంటర్ చదువుతున్న కావలి జ్యోతి తన సృజనాత్మకతతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ‘సోలార్ మల్టీపర్పస్ పోర్టబుల్ టెంట్’ అనే వినూత్న నమూనాను రూపొందించిన విద్యార్థిని ప్రతిభకు గుర్తింపుగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇన్‌స్పైర్ మనక్ జాతీయస్థాయికి ఎంపిక కావడం గమనార్హం. ఈ ప్రతిభతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మరొక గొప్ప అవకాశం లభించింది. జపాన్ సైన్స్,టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘సకుర సైన్స్ ప్రోగ్రాం’ కింద మన రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా.. అందులో కావలి జ్యోతి ఒకరు ఉండడం విశేషం.
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
కూడేరు: వడదెబ్బకు గురై ఓ వృద్ధురాలు మృతి చెందింది. గార్లదిన్నె మండలం సంజీవ పురానికి చెందిన బొగ్గు వెంకటలక్ష్మమ్మ (65) ఆదివారం కూడేరులో పోలీసు స్టేషన్ వెనుక వైపు వ్యవసాయ పొలంలో విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆ పొలం రైతు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఆమె వద్ద లభించిన కవర్లో ఆస్పత్రి చీటీ కనిపించింది. అందులో ఉన్న చిరునామా ఆధారంగా కుమారుడు సోముకు సమాచారమిచ్చారు. అతను వచ్చి చనిపోయినది తన తల్లి వెంకటలక్ష్మమ్మ అని గుర్తించాడు. తన తల్లి పుట్టినిల్లు అరవకూరని, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంటి వద్ద ఉండకుండా తిరుగుతుండేదని చెప్పాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలిపాడు. ఈ క్రమంలో శనివారం ఆమె వడదెబ్బకు గురై మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


