సాక్షి, పుట్టపర్తి
ప్రజాప్రతినిధులు కాదు... ఎలాంటి హోదా ఉండదు... కానీ ‘తెలుగు తమ్ముళ్లు’ అధికార దర్పంతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటూ హల్‌చల్ చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు ప్రతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు పాల్గొంటూ ప్రజాప్రతినిధులను మించి హడావుడి చేస్తున్నారు. ప్రతి పంచాయితీలోనూ జోక్యం చేసుకుంటూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. అధికారం చూపి అధికారులతోనే సలాములు కొట్టించుకుంటున్నారు. దీంతో గ్రాఉమ సచివాలయాల నుంచి ఆర్డీఓ, డీఎస్పీ ఆఫీసుల వరకూ ‘పచ్చ’ పెత్తనమే కొనసాగుతోంది.
ఉనికి కోల్పోకుండా..
ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, మడకశిరలోని టీడీపీ నేతలు షాడో ఎమ్మెల్యేల అవతారమెత్తారు. తమ ఉనికి కోల్పోకుండా ఉండేందుకు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. కొందరైతే అధికారులను ఇళ్లకే పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారు. మరికొందరు అధికారిక సమావేశాల్లో పాల్గొని ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటుగా మార్చుకున్నారు. ఎమ్మెల్యే ఎవరైనానా.. అక్కడంతా వారిదే పెత్తనం అన్న చందంగా ప్రైవేటు ప్రచారం చేయించుకుంటున్నారు.
అ‘ధర్మం’గా శ్రీరామ్ పెత్తనం..
ధర్మవరం నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. పెత్తనం మాత్రం పరిటాల శ్రీరామ్‌దే. నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ తలదూరుస్తూ..అంతా తానే అనేలా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పేరుతో పార్టీ కార్యక్రమాలతో పాటు అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. కూటమి ధర్మం పాటిస్తున్నామని చెబుతూ.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మరోవైపు జనసేన ఇన్‌చార్జ్ కూడా తన స్థాయిలో తాను పెత్తనం చేస్తున్నారు. మంత్రి అప్పుడప్పుడూ నియోజకవర్గానికి వస్తుండగా హడావుడంతా స్థానిక నేతలే చేస్తుండటంతో జనం కూడా ఏ పనికోసమైనా వారి వద్దకే వెళ్తున్నారు.
మడకశిరలో పెత్తందారీ హవా..
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన మడకశిరలో టీడీపీ ఇన్‌చార్జ్‌గా వ్యాపారవేత్త గుండుమల తిప్పేస్వామి ఉన్నారు. ఓ వైపు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన స్థానికేతరుడు ఎంఎస్ రాజు జనం దృష్టిలో, అధిష్టానం కంట పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కానీ ఎంఎస్ రాజు... చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తుండగా... గుండుమల తిప్పేస్వామి మాత్రం ఎమ్మెల్యే స్థాయిలో సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్నాయి. పెత్తందార్లకు పెత్తనం కట్టాలనుకున్నప్పుడు తమకు రిజర్వేషన్ ఎందుకని వాపోతున్నారు.
‘పురం’లో పీఏల పెత్తనం..
సినీనటుడు నందమూరి బాలకృష్ణ చుట్టపు చూపుగా హిందూపురం వస్తుంటారు. అయితే ఆయన అనుచరులు అన్నీ తామై వ్యవహరిస్తుంటారు. ఒకరు కాదు.. ఇద్దరు చాలరు.. అన్నట్లు ఏకంగా ముగ్గురు పీఏల పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో ఎవరికి సమాధానం చెప్పుకోవాలంటూ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.
అధికారం మాది... అడిగేవారెవరు అన్నట్లుగా ‘పచ్చ’ నేతలు రెచ్చిపోతున్నారు. సెటిల్‌మెంట్లు, భూదందాలు, ఇసుక, మద్యం అక్రమ రవాణాలో ఆరితేరి పోయారు. చివరకు అధికారిక కార్యక్రమాల్లోనూ దర్జా చూపుతున్నారు. ఎలాంటి హోదా లేకపోయినా.. కలెక్టర్ పక్కనే కూర్చుని ఫోజులిస్తున్నారు. తమ స్థాయి ఇదీ అంటూ చాటుకుంటున్నారు. ప్రొటోకాల్‌ను మరచిన అధికార యంత్రాగం కూడా ‘పచ్చ’ నేతలకే దండాలు పెడుతోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో
టీడీపీ నేతల దర్జా
అధికారుల సమావేశాల్లో హడావుడి
హోదా లేకున్నా జిల్లా సమీక్షలకు హాజరు
కలెక్టరేట్ సమావేశాల్లోనూ
పల్లె, పరిటాల హల్‌చల్
ప్రొటోకాల్ లేకుండా పక్కనే కూర్చున్నా పట్టించుకోని కలెక్టర్
హిందూపురం, మడకశిరలోనూ
షాడో ఎమ్మెల్యేలు


