బత్తలపల్లి: ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, నిరుపేదలకు మేలు చేసే ‘ఉపాధి చట్టం’ పరిరక్షణకు కలిసి వచ్చే అన్ని పార్టీలతో ఉమ్మడి పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఉపాధిహామీ కూలీల హక్కుల కోసం సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. శనివారం బత్తలపల్లి మండలం కాటికోటేశ్వరక్షేత్రం నుంచి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తమ బృందంతో పాదయాత్రగా లింగారెడ్డిపల్లి క్రాస్ వద్దకు చేరుకోగా... వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో పాటు మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కళ్యాణదుర్గం, ధర్మవరం నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంతపురం తాజా మాజీ మేయర్ వసీం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, బత్తలపల్లి వైస్ ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్‌సింగ్ గురియ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తదితరులు మాట్లాడారు. వలసలు నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు 2005లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో బండ్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఉపాధిహామీ పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర ఖజానాపై భారం..
ఉపాధి చట్టం స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వీబీ జీ రాంజీ పథకం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతుందని నేతలు అన్నారు. గతంలో ఉపాధి పథకానికి 90 శాతం నిధులను కేంద్రం అందించేదని, కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాల్సి వస్తోందన్నారు. కేంద్రం 90 శాతం నిధులు మంజూరు చేసినప్పడే టీడీపీ సర్కార్ బిల్లులు సకాలంలో చెల్లించలేదని, ఇప్పుడు 40 శాతం నిధులివ్వాలంటే కష్టమేనన్నారు. దీనివల్ల మళ్లీ వలసలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజుల పని దినాలు కూడా కల్పించలేదన్నారు. గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజులు పని కల్పించినట్లు వివరించారు. అందువల్ల పాత పద్ధతిలోనే ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. పాదయాత్రలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జాతీయ కార్యదర్శి నిర్మల్, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు వెంకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, ఆవుల శేఖర్, బండి వెంకటేశ్వరరావు, వేమయ్య యాదవ్, మల్లికార్జున, రాజారెడ్డి, వలరాజు, నాసర్, సంతోష్‌కుమార్, యుగంధర్, చంద్ర నాయక్, కాటమయ్య, చలపతి, ముసుగు మధు, కదిరప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు చల్లా మహేష్‌నాయుడు, కోటి సురేష్‌కుమార్, గుర్రం శ్రీనివాసరెడ్డి, బండి వీరనారప్ప, షరాబ్ యోగానంద ఆచారీ, బగ్గిరి బయపరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బ్యాల్ల పెద్దయ్య, మాజీ సర్పంచులు అక్కిం దామోదర్, చెడిపోతుల గోపాల్, గొల్లపల్లి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీబీ జీ రాంజీతో రాష్ట్రంపై పెనుభారం
ఏన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా.. ప్రయోజనం లేదు
వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా
అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్రకు మద్దతు


