● జయంతి వేడుకల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్
ప్రశాంతి నిలయం: సంఘ సంస్కర్త, కుల నిర్మూలన, సీ్త్ర విద్య కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మానవతావాది జ్యోతిరావు పూలే మార్గం అనుసరణీయని కలెక్టర్ శ్యాంప్రసాద్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారుల సమక్షంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టేకులోడు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్
మాట్లాడుతూ... విద్య ద్వారానే మార్పు సాధ్యమని నమ్మిన పూలే సీ్త్ర విద్య, బడుగుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడారన్నారు. సమాజంలో అసమానతలు, కుల వివక్షను రూపుమాపడానికి ఫూలే ఆశయాలు, దార్శనికత నేటి తరానికి ఆదర్శమన్నారు. పూలే స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా బీసీలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సీఎస్‌ఆర్ నిధులు రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టిన బర్జర్ పెయింట్స్ నిర్వాహకుడు రాజేష్, దేవరాజ్‌లను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్, ఆర్డీఓ సువర్ణ, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు విద్యార్థులు పాల్గొన్నారు.


