న్యూస్‌రీల్
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
పుట్టపర్తి: జిల్లాలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిబంధనల మేరకు పక్కాగా జరగాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులను అడిగి తెలుసుకున్నారు. గడువులోపు మూల్యాంకనం పూర్తి చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా మార్కులు నమోదు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ కిష్టప్ప, విద్యాశాఖ అధికారులు ఉన్నారు.
డీఎస్పీ విజయ్‌కుమార్‌పై బదిలీ వేటు
పుట్టపర్తి టౌన్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్‌పై బదిలీ వేటు పడింది. రాష్ట్రంలోని ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి డీఐజీ హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్‌ను శ్రీకాకుళం జిల్లా మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు. అయితే పుట్టపర్తి డీఎస్పీగా ఎవరినీ నియమించలేదు. 17 నెలలుగా విజయకుమార్ పుట్టపర్తి డీఎస్పీగా పనిచేశారు. పలు అంశాల్లో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. విదేశీయుల భూముల అంశం, కొత్తచెరువు హత్యకేసు, పేకాట అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు.


