అనంతపురం: కరువు పరిస్థితుల నుంచి బయటపడాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అత్యంత అవశ్యమని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. అలాంటి కీలకమైన సాగు–తాగునీటి ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని గండికొట్టడంపై మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపివేతతో ‘సీమ’ ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్ట్‌లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌ల పూర్తి కోసం ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. దివంగత వైఎస్సార్ చొరవతోనే రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామన్నారు.
● ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లు – సమాలోచన’ అనే అంశంపై శుక్రవారం అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, గ్రేటర్ రాయలసీమ టాస్క్‌ఫోర్స్ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య, మెట్టు గోవిందరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్‌నాథ్‌రెడ్డి, కేవీ రమణ తదితరులు మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని, హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయాలని, ‘రాయలసీమ డిక్లరేషన్’ పూర్తితో పాటు పలు అంశాలపై తీర్మానం చేశారు.
పోరు ఉధృతం
బాబు ఆలోచన సరైంది కాదు
రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. సీమకు తీరని ద్రోహం
రాయలసీమ ఎత్తిపోతల పాజెక్టు పూర్తి చేస్తేనే ఉమ్మడి అనంతకు సాగు–తాగునీరు
రూ.10వేల కోట్ల ఖర్చుతో పెండింగ్ నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు
హంద్రీనీవా కాలువ వెడల్పు,
‘రాయలసీమ డిక్లరేషన్’ పూర్తికి తీర్మానం
జల సాధన పోరుబాటకు సిద్ధం కావాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలోవైఎస్సార్‌సీపీ నేతల పిలుపు
ప్రాజెక్టులను పరిరక్షించుకోవాలి
రాయలసీమలో పుట్టిన ప్రతి బిడ్డ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. అనంతపురంలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్ సంస్థను అమరావతికి తీసుకెళ్లారు. బడ్జెట్‌లలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నయాపైసా కేటాయించలేదు.
– తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వై ఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త


