ఉక్కపోత.. పుస్తకాల్లేక.. | - | Sakshi
Sakshi News home page

ఉక్కపోత.. పుస్తకాల్లేక..

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

పరీక్షలు ముగియగానే హమ్మయ్యా...

అంటూ ఊపిరి పీల్చుకున్న ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం మళ్లీ పరీక్ష పెడుతోంది. ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించే వారికి ‘ప్రత్యేక తరగతులు’

అంటూ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ముఖ్యంగా ఎండలు దంచుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుస్తకాలు పంపిణీ చేయకుండానే పాఠాలు చెబుతుండగా.. విద్యార్థులు

దిక్కులు చూస్తున్నారు.

పుట్టపర్తి: ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం విషమ పరీక్ష పెట్టింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో ‘ప్రత్యేకం’ అంటూ తరగతుల నిర్వహిస్తోంది. భానుడి భగభగలతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. కానీ ఇంటర్‌ విద్యార్థులకు మాత్రం ఈ అవకాశం ఇవ్వలేదు. మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రత్యేక తరగతులంటూ హింసపెడుతోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ క్లాసులు నిర్వహిస్తోంది. పుస్తకాల పంపిణీ చేయకుండా తరగతులు నిర్వహిస్తుండటంతో అధ్యాపకులు ఏం చెబుతున్నారో విద్యార్థులకు తెలియడం లేదు.

అందరికీ ఇబ్బందే..

మార్చి నెలాఖరు వరకూ ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సేదదీరుతున్నారు. చాలా మంది బంధువుల ఊళ్లకు వెళ్లేందుకు, శీతల ప్రదేశాల్లో విహరించేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటు విద్యార్థులు, అటు అధ్యాపకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో చాలా మంది ప్రత్యేక తరగతులకు హాజరు కావడం లేదు. ప్రత్యేక తరగతుల సమయం మార్చాలని ఇదివరకే అధ్యాపకులు నిరసనకు దిగారు. అయినా చంద్రబాబు సర్కార్‌ వెనక్కు తగ్గలేదు.

భారీగా పడిపోయిన హాజరు..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేటు కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసి ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు 11,737 మంది ఉన్నారు. ఇందులో బాలికలు సుమారు 6,197 మంది ఉన్నారు. చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని కళాశాలలకు వస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా ఆ తర్వాత బస్టాండుకు చేరుకుని స్వగ్రామానికి వెళ్లే బస్సు ఎక్కాలంటే గగనంగా మారుతోంది. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయపెడుతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వం పుస్తకాలు కూడా ఇవ్వకుండా పాఠాలు చెప్పడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక తరగతులకు కనీసం 10 శాతం మంది కూడా హాజరు కావడం లేదు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం

తరగతులు ప్రారంభం

పుస్తకాలు పంపిణీ చేయకుండానే పాఠాలు

ఎండలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

భారీగా పడిపోయిన హాజరుశాతం

Advertisement
 
Advertisement
Advertisement