ప్రశాంతి నిలయం: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనన్నారు.
స్కూల్ అసిస్టెంట్ల
సీనియార్టీ జాబితా సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జెడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించడానికి తాత్కాలిక సీనియార్టీ జాబితా సిద్ధం చేసినట్లు ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియార్టీ జాబితాను మూడోసారి డీఈఓ బ్లాగ్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఉపాధ్యాయుల సీనియార్టీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 15లోగా రాతపూర్వకంగా తగిన ఆధారాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.
నేత్రపర్వంగా
జ్యోతుల ఉత్సవం
రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అప్పేపల్లి, కాకి గ్రామంతో పాటు దొమ్మరహట్టి గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి అమ్మవారికి జ్యోతుల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్‌ను వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలరించి పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాక, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తులంతా ఆలయ సమీపంలోని పాలబావిలో గంగ పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రత్నగిరిలోని ఎస్సీ కాలనీ వాసుల జ్యోతుల ఉత్సవం ఉంటుందని రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు.
రెచ్చిపోయిన
‘పచ్చ’ గూండాలు
● మట్టి తరలింపును అడ్డుకున్న
గ్రామస్తులపై దాడికి యత్నం
● చెరువు వద్ద నుంచి గ్రామం వరకూ తరుముకుంటూ వెళ్లిన వైనం
నల్లచెరువు: సహజ వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నాయకులు చివరకు మట్టినీ వదలడం లేదు. చెరువుల నుంచి సారవంతమైన మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈక్రమంలోనే కొందరు టీడీపీ నేతలు మండలంలోని అల్లుగుండు గ్రామ సమీపంలోని పాలకమ్మ చెరువు నుంచి సారవంతమైన మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ అక్కడకు చేరుకుని వాహనాలను అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న వారు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ సమాచారాన్ని ఫోన్ చేసి తెలపడంతో దాదాపు 30 మందికి పైగా టీడీపీ గూండాలు పాలకమ్మ చెరువు చేరుకుని గ్రామస్తులపై దాడికి తెగబడ్డారు. ‘‘అధికారపార్టీ నేతలమైన మమ్మల్నే అడ్డుకుంటారా.. రండి రా.. చూసుకుందాం.. ప్రాణాలు తీస్తాం.. జాగ్రత్త’’ అంటూ.. చెరువు వద్ద నుంచి గ్రామం వరకూ ప్రజలను తరుముకుంటూ వెళ్లారు. భయాందోళనకు గురైన గ్రామస్తులు ఘటనపై శుక్రవారం ఉదయం తహసీల్దార్ రవినాయక్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని, లేకపోతే తాగు, సాగునీటి సమస్యలు ఎదురవుతాయన్నారు. మరోవైపు నీటి పారుదల శాఖ ఏఈ ఆదెమ్మ.. క్షేత్రస్థాయిలో పరిశీలించి మట్టి అక్రమ తవ్వకాలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


