పుట్టపర్తి అర్బన్: మండలంలోని వెంగళమ్మచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) లో గోల్‌మాల్ వెలుగు చూసింది. రైతులకు ఇచ్చే రుణాల్లో రూ.20లక్షలు పక్కదారి పట్టినట్లు విశ్వసనీయ సమాచారం. సొసైటీ పరిధిలో 500 మందికి పైగా రైతులు ఉండగా, వీరందరూ భూములను తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నారు. వీటికి సంబంధించి ఏటా వడ్డీలు చెల్లించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సొసైటీలో ప్రతి ఏటా లాంగ్ టర్మ్ కింద రూ.1.5 కోట్లు, షార్ట్ టర్మ్ కింద రూ.3.5 కోట్ల టర్నోవర్ జరుగుతోంది.
క్లర్క్‌గా చేరి... సీఈఓగా ఎదిగి
వెంగళమ్మచెరువు పంచాయతీలోని వీరాంజనేయపల్లికి చెందిన వెంకటాద్రి తొలుత ఈ సొసైటీలో క్లర్క్‌గా చేరాడు. కాలానుగుణంగా అదే సొసైటీకి సీఈఓగా అధికారులు నియమించారు. చాలా ఏళ్లుగా ఈ హోదాలనే ఆయన పనిచేశాడు. 2024 జూన్‌లో అతని పదవీ కాలం ముగిసింది. అయితే కోర్టుకు వెళ్లి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగించుకోవడంతో పాటు సీఈఓ జీతం తీసుకుంటూ క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. ప్రస్తుతం అతని పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. సీఈఓగా ఉన్నప్పుడే రైతులు చెల్లించే వడ్డీలను స్వాహా చేస్తూ వాటిని కప్పి పుచ్చుకునేందుకు క్లర్క్ గా అవతారమెత్తినట్లు అతనిపై ఆరోపణలున్నాయి.
వడ్డీపై అదనంగా వసూలు
తాము తీసుకున్న రుణాలకు సంబంధించి రైతులు ఏటా మార్చి నుంచి జూన్ నెల లోపు రెన్యువల్ చేయిస్తుంటారు. ఇందుకుగాను గతంలో రసీదులను మాన్యువల్‌గా అందజేసేవారు. 2024 నుంచి ఈ ప్రక్రియను కంప్యూటరైజ్డ్ చేశారు. దీంతో అప్పటి నుంచి రసీదులు, బిల్లులు అన్నీ కంప్యూటర్ కాఫీలనే అందజేస్తున్నారు. అయితే వెంకటాద్రి నేటికీ మాన్యువల్ రసీదులను స్వయంగా సంతకం చేసి రైతులకు అందజేస్తున్నాడు. ఈ క్రమంలో వడ్డీకి అదనంగా డబ్బు రైతుల నుంచి వసూలు చేసి, బ్యాంక్‌కు కట్టే సమయంలో రుణానికి వడ్డీ మాత్రం చెల్లించి మిగిలిన మొత్తాలను స్వాహా చేస్తూ వచ్చినట్లు ఆరోపణలున్నాయి. మాన్యువల్ రసీదు పుస్తకాలను సొసైటీలో ఉంచకుండా తన ఇంట్లో ఉంచుకుని మొత్తం కథ నడిపించినట్లుగా సమాచారం.
దాటవేత ధోరణితో తప్పించుకుంటూ
సీఈఓగా వెంకటాద్రి పదవీ కాలం ముగియగానే ఇన్‌చార్జ్ సీఈఓగా రవిశంకరరెడ్డిని నియమించారు. ఈ క్రమంలో చెల్లింపుల్లో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించిన ఆయన రైతులను నిలదీశారు. అయితే తాము వడ్డీలు చెల్లించామంటూ కొందరు రైతులు తమ వద్ద ఉన్న మాన్యువల్ రసీదులను చూపడంతో స్వాహా పర్వం బయటపడింది. ఈ అంశంపై వెంకటాద్రిని సొసైటీ అధ్యక్షుడు శ్రీరామరెడ్డి, ఇన్‌చార్జ్ సీఈఓ నిలదీశారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో లోతైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నానంటూ విచారణకు సహకరించకుండా వెంకటాద్రి దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో రైతుల వద్ద ఉన్న మాన్యువల్ రసీదులను సొసైటీ అధ్యక్షుడు తెప్పించుకుని వాటిని భద్రపరిచారు. 500 రసీదులకు గాను ప్రస్తుతం 100 వరకూ స్వాధీనం చేసుకోగా ఇందులోనే రూ.5 లక్షలకు పైగా స్వాహా అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన మొత్తం రూ.20 లక్షలకు పైగా గోల్‌మాల్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
51 ఎంకై ్వరీ కోరుతున్న రైతులు:
సాధారణంగా వ్యవసాయ సహకార పరపతి సంఘంలో తవకలు చోటు చేసుకుంటే ఆ శాఖకు చెందిన అధికారులు విచారణ చేపడతారు. అయితే వెంగళమ్మచెరువులో పెద్ద ఎత్తున అవతవకలు జరిగినా స్థానిక టీడీపీ నాయకులు, కో–ఆపరేటివ్ బ్యాంకు సిబ్బంది మాత్రమే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ విచారణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. 51 ఎంకై ్వరీ చేపడితేనే అక్రమాలు బయటపడి తమకు న్యాయం జరుగుతుందని రైతులు అంటున్నారు.
రూ.20 లక్షలు స్వాహా
రైతుల నుంచి ఏటా వడ్డీల రూపంలో వసూలు
దొంగ రసీదులతో మాయ చేసిన మాజీ సీఈఓ
విచారణకు సహకరించాలి
వెంగళమ్మ చెరువు సొసైటీలో చోటు చేసుకున్న అక్రమాలపై రైతులు 51 ఎంకై ్వరీ కోరుతున్నారు. అయితే 51 ఎంకై ్వరీ అంటూ జరిగితే సొసైటీకి వచ్చే నిధులు ఆగిపోతాయి. దీంతో విచారణను సొసైటీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఈఓ, బ్యాంకు సిబ్బందినే చేయాలని సూచించాను. విచారణ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఈ విచారణకు వెంకటాద్రి పూర్తిగా సహకరించాలి. తన ఇంట్లో దాచిన రసీదు పుస్తకాలను తీసుకొచ్చి ఇవ్వాలి.
– కృష్ణానాయక్,
జిల్లా సమన్వయ అధికారి (డీసీఓ)


