ఇసుక ట్రాక్టర్ల పటివేత | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ల పటివేత

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

రొద్దం: మండలంలోని పెద్దమంతూరు వద్ద ఉన్న పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. వీటిని తహసీల్దార్‌, ఆర్డీఓకు అప్పగించినట్లు ఎస్‌ఐ వీరాంజనేయులు తెలిపారు.

డైట్‌లో ఘనంగా ఫేర్‌ వెల్‌ డే

పుట్టపర్తి: బుక్కపట్నంలోని డైట్‌ కళాశాలలో శుక్రవారం ఫేర్‌ వెల్‌ డే ఘనంగా జరిగింది. 2024–26 బ్యాచ్‌ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ... తాను కూడా డైట్‌ కళాశాల విద్యార్థినేనని, కొంత కాలం ఉపాధ్యాయుడిగా కూడా పని చేశానని గుర్తు చేశారు. ఏ ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్థి అని, వారి పని తీరు బాగుంటే సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డైట్‌ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గుండెపోటుతో

ఉపాధ్యాయుడి మృతి

బత్తలపల్లి: మండలంలోని డి.చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పాలమసి నారాయణస్వామి(59) గుండెపోటుతో మరణించారు. అనంతపురం రూరల్‌ మండలం ఆకుతోటపల్లి సమీపంలోని బాలాజీ హౌసింగ్‌ కాలనీలో నివాసముంటున్న ఆయన గురువారం రాత్రి గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మరణించారు. కాగా, నారాయణస్వామికి భార్య లక్ష్మి, ఓ కుమారుడు ఉన్నారు. నారాయణస్వామి మృతి చెందిన విషయం తెలియడంతో ఎంఈఓ సుధాకర్‌నాయక్‌తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనంతపురానికి తరలివెళ్లారు. నారాయణస్వామి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.

లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు

20 సూత్రాల కమిటీ చైర్మన్‌

లంకా దినకర్‌

ప్రశాంతి నిలయం: వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు, పథకాల అమలు ఉండాలని అధికారులకు 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ సూచించారు. శుక్రవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. వైద్యం, విద్య, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌ రంగాల్లో సాధించిన విజయాలు, ప్రస్తుత స్థితి గతులను కలెక్టర్‌ వివరించారు. పెనుకొండలో మెడికల్‌ కళాశాల పనులు జరుగుతున్నాయన్నారు. మధ్యాహ్న భోజనం సమగ్రంగా అందిస్తున్నారని, తాగునీటి పథకం పనులు కొనసాగుతున్నాయని, జిల్లాలోని 32 మండలాల్లో 2214 నివాస ప్రాంతాల్లో తాగునీరు అందించేందుకు 3899 పీడబ్ల్యూఎస్‌ స్కీములు, 4033 హ్యాండ్‌ పంపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్‌ పథకానికి 4,942 మంది నమోదు చేసుకోగా 1,130 ఇళ్లకు ఇన్‌స్టలేషన్‌ పూర్తయిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర, ఆర్డీఓ సువర్ణ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

మడకశిర: ఆంధ్రతో పాటు కర్ణాటకలోనూ చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని మడకశిర పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. శుక్రవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఆంజనేయులు, చిన్నా ఉన్నారు. వీరిద్దరూ ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తూ చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవారు. అలాగే పలు ఇళ్లలో చోరీలకు తెగబడ్డారు. ఇప్పటికే ఆంజనేయులుపై 45 కేసులు, చిన్నాపై 15 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మడకశిర ప్రాంతంలో జరిగిన దొంగతనాలపై నిఘా ఉంచిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం ఇద్దరినీ అరెస్ట్‌ చేసి, రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో సమావేశంలో మడకశిర రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌, అర్బన్‌ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ లావణ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement