కదిరి: ఖాద్రీశుడి ఆలయం ఎదుట టెంకాయలు విక్రయించుకునేందుకు నిర్వహించిన టెండర్ అంశం హైకోర్టుకు చేరింది. ఈ నెల 7న టెంకాయల విక్రయానికి ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి టెండర్ పిలవగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హసనాపురం చంటి రూ.31.21 లక్షలకు దక్కించుకున్నాడు. అదే రోజు ఆ మొత్తం డబ్బు డీడీ రూపంలో ఈఓకు అందజేశారు.
అయితే అనంతరం ఆటెండర్‌ను రద్దుచేసిన ఈఓ ఈనెల 16న మరోసారి టెండర్ పిలిచారు. దీనిపై బాధితుడు చంటి తనకు జరిగిన అన్యాయంపై శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ (నం.9847/2026) దాఖలు చేశారు. ఈ కేసును వెంటనే స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున గుడపాటి వెంకటేశ్వర్లు వాదనలు విన్పించారు. 7వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరిగిన కొబ్బరి కాయల వేలంపాట ప్రక్రియ మొత్తాన్ని ఆలయ అధికారులు వీడియో చిత్రీకరించి నిబంధనల మేరకే నిర్వహించారని కోర్టుకు విన్నవించారు. అందులో హెచ్చుపాటదారుడైన తన క్లయింట్ చంటికి తూర్పు రాజగోపురం వద్ద వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొబ్బరికాయలు అమ్ముకునేందుకు హక్కులు కల్పిస్తున్నామని ఆలయ అధికారులు ప్రకటించారన్నారు. ఆలయ అధికారులు సూచించిన బ్యాంకులో ఆ నగదుకు సంబంధించి డీడీ తీసుకొని ఆలయ ఈఓకు అదే రోజు సకాలంలో అందజేసిన విషయాన్ని కూడా ఆ న్యాయవాది ఆధారాలతో కోర్టు ముందుంచారు. కేవలం ఓ ప్రజాప్రతినిధి మాటకు తలొగ్గి మళ్లీ టెండర్లు పిలుస్తున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున నగారు నాగరాజు ఈ కేసులో వాదనలను వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి..ఈ నెల 16న రీ టెండర్ నిర్వహించాలని ఆలయ అధికారులు ప్రకటించినందున, ఈ కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రాజకీయ కక్షతోనే...
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్దన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడైన చంటికి టెంకాయల విక్రయ టెండర్ దక్కడం స్థానిక ఎమ్మెల్యే కందికుంటకు ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే అదే రోజు బహిరంగ వేలంపాటలో రూ.27.20 లక్షలకు వేలం పాట పాడిన బీజేపీకే చెందిన దళిత మోర్చా నాయకుడు తలుపుల గంగాధర్‌కు ఆ టెండర్ కట్టబెట్టాలని ఆలయ ఈఓపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే 7వ తేదీన జరిగిన టెండర్‌ను రద్దు చేసి ఈ నెల 16వ తేదీన మళ్లీ వేలంపాట నిర్వహిస్తామని ఆలయ ఈఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే కందికుంట ఆదేశాల మేరకు ఈఓ టెంకాయల విక్రయానికి రీ టెండర్ పిలిచారని విష్ణువర్దన్‌రెడ్డి వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈఓపై కలెక్టర్ సీరియస్!
కొబ్బరి కాయల టెండర్‌ను రద్దు చేసి, మళ్లీ ఎందుకు టెండర్ పిలవాల్సి వచ్చిందని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డిపై కలెక్టర్ శ్యాంప్రసాద్ సీరియస్ అయినట్లు తెలిసింది. హైకోర్టు దీన్ని అత్యవసర కేసుగా పరిగణిస్తూ లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించిందంటే ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకోవచ్చని కలెక్టర్ మండిపడినట్లు సమాచారం. ‘నీ ఇష్టానుసారం వ్యవహరించడానికి ఇదేమైనా నీ సొంత ఆస్తి అనుకున్నావా? లేదంటే మీ అత్తగారి ఆస్తి అనుకున్నావా?’ అని సీరియస్‌గా మందలించినట్లు విశ్వసనీయ సమాచారం.
కోర్టుకు చేరిన కదిరి టెంకాయల పంచాయితీ
రీ టెండర్‌పై హైకోర్టును
ఆశ్రయించిన చంటి
లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించిన కోర్టు
రాజకీయ ఒత్తిడితోనే రీ టెండర్ పిలిచారన్న న్యాయవాది
కేసును ఈ నెల 15కు వాయిదా వేసిన న్యాయమూర్తి


