అక్రమ తవ్వకాలపై తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అక్రమ తవ్వకాలపై తనిఖీ

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

ముదిగుబ్బ: మండల పరిధిలోని చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను తహసీల్ధార్‌ మహేశ్వరరెడ్డి శుక్రవారం సీజ్‌ చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం నుంచి పార్నపల్లి జలాశయం వరకు ప్రవహిస్తున్న చిత్రావతి నది నుంచి గతంలో ముదిగుబ్బ మండలం పీసీరేవు, తాడిమర్రి మండలం చిత్రావతి సమీపంలోని చిన్నచిగుళ్లరేవు వద్ద మాత్రమే ప్రభుత్వమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. అయితే ఓ ప్రజాప్రతినిధి భారీ యంత్రాలను ఉపయోగించి ఉప్పలపాడు సమీపంలోని చిత్రావతి నది నుంచి ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సమీప పట్టణాలతో పాటు బెంగళూరుకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ అంశంపై ‘చిత్రావతిలో ఇసుక దోపిడీ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ మహేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం రెవెన్యూ సిబ్బందితో కలసి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఇసుక తరలిస్తూ ఓ ట్రాక్టర్‌ పట్టుబడింది. అనంతరం ఉప్పలపాడు వద్ద ఉన్న ఇసుక డంప్‌లను తహసీల్దార్‌ పరిశీలించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న రెండు హిటాచీలను సీజ్‌ చేయకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్‌ మహేశ్వరరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా... అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే హిటాచీలు ఉన్న ప్రాంతం తమ పరిధిలోకి రాదని పేర్కొనడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement