పెనుకొండ రూరల్: అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం దుద్దేబండ గ్రామంలో స్థిరపడిన కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన పాలూరి రమేష్ కుమార్తె అనూష (21)కు గత ఏడాది నవంబర్ 2న గొల్లపల్లికి చెందిన బోయ రాజేష్‌తో వివాహమైంది. పెళ్లి సమయంలో వరుడి కుటుంబ సభ్యులకు కట్నం కింద 8 తులాల బంగారం కోరడంతో పెళ్లి సమయంలో 2.8 తులాలు, రెండేళ్ల తర్వాత 4.2 తులాలు మొత్తం 8 తులాలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తమకు తెలియకుండా అనూష కుటుంబసభ్యులు బంగారాన్ని మార్చారంటూ అత్తింటి వారు అనుమానంతో ఆమెను వేధిస్తూ వచ్చారు. మిగులు బంగారాన్ని కూడా తీసుకురావాలని ఒత్తిడి చేయసాగడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అనూషను పుట్టింటికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. అయినా అత్తింటి వారిలో మార్పు రాలేదు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న అనూష గురువారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ నర్శింగప్ప, సీఐ రాఘవన్, తహసీల్దార్ స్వాతి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. భర్త రాజేష్, అత్త జయలక్ష్మి, మామ రామాంజనేయులు వేధింపులు తాళలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు కియా ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.


