కందికుంట అరాచకం! | - | Sakshi
Sakshi News home page

కందికుంట అరాచకం!

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

కదిరి: దేశవ్యాప్తంగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే కదిరిలో మాత్రం కందికుంట రాజ్యాంగం అమలవుతోంది. తన స్వార్థం కోసం ప్రత్యర్థి పార్టీల నేతలను ఇబ్బంది పెట్టిన ఆయన.. ఇప్పుడు ఏకంగా దేవుడితోనే రాజకీయం చేస్తున్నారు. అరాచకంగా వ్యవహరిస్తూ అంతా నా ఇష్టం.. అనే రీతిలో చెలరేగిపోతున్నారు. నిబంధనల ప్రకారం రెండు రోజుల క్రితం జరిగిన కొబ్బరి కాయల టెండర్‌ తాను చెప్పిన వారికి కాకుండా మరో వ్యక్తి దక్కించుకోవడంతో దాన్ని రద్దు చేయించి రీటెండర్‌ పిలవాలని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్యేనే ఆర్డర్‌ వేయడంతో ఏం చేయాలో తెలియని ఈఓ ఆ టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

నిబంధనల మేరకు టెండరు ఖరారు..

ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ తూర్పు గోపురం ఎదుట కొబ్బరి కాయలు విక్రయించుకునేందుకు ( 2027 మార్చి వరకు) ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ–టెండర్‌తో పాటు సీల్డ్‌ టెండర్‌, అలాగే బహిరంగ వేలం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చంటి సీల్డ్‌ టెండర్‌ ద్వారా రూ.31.21 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు విష్ణువర్దన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇదే టెండర్‌ కోసం అదే పార్టీకి చెందిన దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు తలుపుల గంగాధర్‌ ప్రయత్నించినప్పటికీ ఆయన రూ.27.20 లక్షలకు మాత్రమే బహిరంగ వేలంలో తన పాటను ఆపేయడంతో నిబంధనల ప్రకారం హెచ్చుపాట దారుడైన చంటికి ఆలయ అధికారులు టెండర్‌ను ఖరారు చేశారు. అదే రోజు ఆలయ అధికారులు సూచించిన మేరకు చంటి ఆ మొత్తాన్ని డీడీ రూపంలో ఈఓకు అందజేశారు.

రద్దు చెయ్‌.. లేదంటే సెలవుపై వెళ్లు!

తనకు వ్యతిరేకంగా ఉన్న విష్ణువర్దన్‌రెడ్డి వర్గీయులకు టెంకాయల విక్రయ టెండర్‌ ఎలా కట్టబెడతారని ఆలయ ఈఓను ఎమ్మెల్యే కందికుంట బూతులు తిట్టినట్లు విష్ణు వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆ టెండర్‌ రద్దు చేయకపోతే సెలవుపై వెళ్లిపోవాలని కందికుంట హుకుం జారీ చేసినట్లు వారు చెబుతున్నారు. న్యాయంగా, నిబంధనల మేరకు జరిగిన టెండర్‌ను చంటి దక్కించుకున్నారని. ఆయన కోసం అవసరమైతే బీజేపీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళతామని విష్ణువర్దన్‌రెడ్డి వర్గం చెబుతోంది. అలాగే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని వారంటున్నారు.

ఆగని ఆధిపత్యపోరు..

2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి కదిరిలో తనకు వ్యతిరేకంగా పని చేశాడని స్థానిక ఎమ్మెల్యే కందికుంట ఆయనపై కోపంగా ఉన్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు రాతపూర్వకంగా కందికుంట ఫిర్యాదు చేసినట్లు ఇటీవల సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ మీడియా ముందు ఆ లెటర్‌ను బయట పెట్టారు. వారిద్దరి మధ్య గత రెండేళ్లుగా కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఈక్రమంలోనే ఇటీవల నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో తనను తేరుపైకి రాకుండా కందికుంట హౌస్‌ అరెస్ట్‌ చేయించారని విష్ణు ఆరోజు బహిరంగంగా ఆరోపించారు. కొబ్బరి కాయల టెండర్‌ను కూడా రూ.4 లక్షలు తక్కువకు పాడిన గంగాధర్‌కు కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఎలా చెబుతారని విష్ణు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఎంతో మహిమ గల కదిరి లక్ష్మీ నరసింహ స్వామితో రాజకీయం చేసిన వారికి ఆ దేవుడే తగిన శిక్ష విధాస్తారని వారు హెచ్చరిస్తున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం దేవుడి ఆదాయానికి గండి కొడతారా? అని భక్తులు ఆగ్రహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా కొబ్బరి కాయల టెండర్‌ పిలవకుండా జాప్యం చేస్తూ స్వామివారి ఆదాయానికి ఇప్పటికే భారీగా నష్టం తెచ్చారని భక్తులు మండిపడుతున్నారు.

పగిలిన ‘అసమ్మతి’ టెంకాయ

ఏకపక్షంగా నృసింహాలయ

కొబ్బరికాయల టెండర్‌ రద్దు

ఈఓపై ఒత్తిడి తెచ్చి

రద్దు చేయించిన ఎమ్మెల్యే!

ఈ నెల 16న మరోసారి వేలంపాట

టెండర్‌ రద్దు వాస్తవమే

ఈ నెల 7వ తేదీన జరిగిన కొబ్బరి కాయల టెండర్‌పై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అందుకే వేలం షరతుల్లో పేర్కొన్న వరుస నంబర్‌ 17ను అనుసరించి ఆ టెండర్‌ను రద్దు చేస్తున్నాం. ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఆలయ ప్రాంగణంలో కొత్తగా మళ్లీ వేలం పాట నిర్వహిస్తాం.

–శ్రీనివాసరెడ్డి, ఖాద్రీ ఆలయ ఈఓ

Advertisement
 
Advertisement
Advertisement