లేపాక్షి: మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో (2026–27 విద్యా సంవత్సరం) ప్రవేశాలకు ఎంజేపీఏపీ బీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం, వివిధ తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సీఈటీ) నిర్వహిస్తున్నట్టు స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ చందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5వ తరగతికి, 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియెట్, అలాగే వివిధ తరగతుల్లో మిగిలిపోయిన సీట్లకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని, హాల్‌టికెట్, అవసరమైన గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం పాఠశాల కార్యాలయాన్ని లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
గ్యాస్, రేషన్ పంపిణీ
పక్కాగా జరగాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో గ్యాస్, రేషన్ పంపిణీ పారదర్శకతతో పక్కాగా జరగాలని జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో పౌరసరఫరాల శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు గ్యాస్ డోర్ డెలివరీ చేయాలని, బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సిలిండర్లు అందించాలన్నారు. అలాగే డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా చూసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కమర్షియల్ సిలిండర్లను ప్రాధాన్యతా క్రమంలో పాఠశాలలు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు అందించాలన్నారు. రేషన్ షాపుల వద్ద బ్యానర్లు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై 6–ఏ కేసులు నమోదు చేయాలన్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దాడులు పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, పలువురు డీలర్లు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.


