● 12వ పీఆర్సీ నియమించాలి
● 30 శాతం ఐఆర్ వెంటనే ఇవ్వాలి
● ఉపాధ్యాయ సంఘాల నేతల డిమాండ్
పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పితే తామంతా పోరుబాట పట్టక తప్పదని ఉపాధ్యాయులు తేల్చిచెప్పారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విడతల వారీ ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయులు గురువారం కొత్తచెరువులోని పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న కేంద్రాల వద్ద నిరసనకు దిగారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాద్‌రెడ్డి, కార్యదర్శి గౌస్ లాజంతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు. ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు పవన్‌కళ్యాణ్ కూడా ఉపాధ్యాయులకు అలవిగాని హామీలిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఉపాధ్యాయ, ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లించడంతో పాటు మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ ఊసే లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి వెంటనే పీఆర్సీ కమిషన్ వేయాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు కోశాధికారి గోపాల్, డిప్యూటీ కార్యదర్శి చంద్ర, సమీఉల్లా, గోపాల్ నాయక్, జాఫర్ హుస్సేన్, వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ఆ సంఘ నేతలు ప్రకాశ్‌రెడ్డి, మస్తాన్, వెంగమ నాయుడు, యూటీఎఫ్ నేతలు రామకృష్ణనాయక్, లక్ష్మీనారాయణ, లక్ష్మమ్మ, ఏపీటీఎఫ్ నేత అశోక్‌కుమార్, ముత్యాలప్ప, రాజశేఖర్ పాల్గొన్నారు.


