తలుపుల: ‘చెట్లు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం’ అంటూ ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అడవులను సంరక్షిస్తే కొందరు స్వార్థపరులు ఆ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. విచ్చలవిడిగా చెట్లు కొట్టేసి సొమ్ము చేసుకుంటున్నారు. తలుపుల మండలంలోని అటవీ ప్రాంతంలో ఇటీవల కొందరు ఇష్టారాజ్యంగా చెట్లను నేలకూలుస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మడుగుతండా సమీపంలో వేలాది సండ్ర చెట్లను అక్రమార్కులు నేల కూల్చి మొద్దులుగా మార్చారు. 15 నుంచి 20 ట్రాక్టర్లలో తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
ఎర్రచందనం పోలికతో డిమాండు
సండ్ర దుంగలు చూసేందుకు ఎర్ర చందనం దుంగల్లా కనిపిస్తుండడంతో అక్రమార్కుల కన్ను వీటిపై పడినట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం దుంగల్లో వీటిని కలిపి విక్రయించి భారీగా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతోనే సండ్ర చెట్లు నరికినట్లు సమాచారం. ఈ విషయంపై తలుపుల ఇన్‌చార్జ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరసింహమూర్తిని వివరణ కోరగా, ఆయన స్పందించారు. మడుగుతండా సమీపంలోని అటవీ ప్రాంతంలో సండ్ర చెట్లను కొట్టి దుంగలుగా ఉంచారనే సమాచారంతో క్షేత్ర స్థాయిలో పరిశీలించామన్నారు. సండ్ర మొద్దులను తరలించకుండా నిఘా ఉంచామన్నారు. చెట్లు నరికిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తలుపుల మండలంలో
ఇష్టారాజ్యంగా నరికివేత
పట్టించుకోని అటవీ అధికారులు


