దళితుల ప్రాణాలంటే లెక్కలేదా బాబూ? | - | Sakshi
Sakshi News home page

దళితుల ప్రాణాలంటే లెక్కలేదా బాబూ?

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు

అనంతపురం టవర్‌క్లాక్‌: ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు తీవ్రంగా జరుగుతున్నాయి. అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దళితుల ప్రాణాలంటే లెక్కలేదా?’ అంటూ ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు అన్నారు. మంగళవారం స్థానిక పాతూలోని గిరిజన భవన్‌ లో మాదిగల చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సువర్ణ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రమూ స్పందించడం లేదన్నారు. దళితులకు అండగా ఉంటానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు నేడు కేవలం అగ్రవర్ణాల వారికి అండగా ఉంటూ దళితులకు అన్యాయం చేస్తున్నారన్నారు. దళితులపై దాడులు జరిగి నష్టపోయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. అగ్రవర్ణాల వారు నష్టపోతే వారికి పరిహారం అందిస్తున్నారని, దళితులవి మాత్రం ప్రాణాలు కావా అని ప్రశ్నించారు. దళిత నాయకుడు టీఎం రమేష్‌ను అత్యంత కిరాతకంగా కొందరు హత్యచేస్తే ఇప్పటిదాకా ఆ కుటుంబానికి చిన్న సాయమూ అందలేదన్నారు. మాదిగల పెద్దబిడ్డనవుతానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు నేడు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ న్యాయం చేసి ప్రజల మన్నన పొందారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొండి చేయి చూపిస్తోందన్నారు. సూపర్‌ సిక్స్‌ అమలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో జెన్నే చిరంజీవి, సాకే ఓబులేసు, జయప్రకాష్‌, రామాంజినేయులు, సుదర్శన్‌, గిరిజన సంఘం నాయకులు మల్లి కార్జున నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement