పుట్టపర్తి అర్బన్: నూతన ఆవిష్కరణలతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి ఇన్నోవేషన్ డిజైన్ ఎంటర్‌పెన్యూర్ (ఐడీఈ) బూట్ క్యాంప్ పుట్టపర్తిలోని సంస్కృతీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఏఐసీటీఈ–ఢిల్లీ ఇన్నోవేషన్ ఆఫీసర్ అభిషేక్ రంజన్ హాజరై, మాట్లాడారు. యువత సొంత గ్రామాలకు పరిమితం కాకుండా దేశంలో ఎన్నో పారిశ్రామిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఐడీఈ బూట్ క్యాంప్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ఏపీలోని రెండో కళాశాలగా సంస్కతికి అవకాశం దక్కడం విశేషమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడతుందన్నారు. ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ హేమచంద్రారెడ్డి, డైరెక్టర్ నాగరాజు, వివిధ రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు
సంస్కృతిలో ఘనంగా ఐడీఈ బూట్ క్యాంప్


