యల్లనూరు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని మండల కేంద్రానికి చెందిన అశోక్ తన తల్లితో పాటు భార్యపై దాడికి యత్నించాడు. అడ్డుగా వచ్చిన బావమరిది సురేంద్ర అలియాస్ సూరీపై దాడి చేయడంతో అతని తలకు తీవ్రగాయమైంది. అని ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. ఆయన వివరాలమేరకు... అశోక్ మద్యానికి బానిస అయ్యాడన్నారు. ఇందులో భాగంగానే తరచూ తల్లి కృష్ణమ్మ, భార్యతో గొడవ పడేవాడన్నారు. ఆదివారం కూడా డబ్బు కోసం తల్లి, భార్యతో గొడవ పడుతుండగా బావమరిది అశోక్ అడ్డుపడ్డాడని పేర్కొన్నారు. సురేంద్రపై కొడవలితో దాడిచేయడంతో తలకు తీవ్రగాయమైందన్నారు. క్షతగాత్రుడిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించారన్నారు. అశోక్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
జంబుకేశ్వరస్వామీ నమోనమః
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ముగిశాయి. చివరి రోజు ఆదివారం సాయంత్రం స్వామి వారి సప్త ప్రాకారోత్సవం, శయనోత్సవ వేడుకలను అర్చకుడు రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేకులకుంట సత్యనారాయణ, దేవదాయశాఖ ఈఓ నరసింహారెడ్డి, బ్రాహ్మణ సంఘం పెద్దలు పాల్గొన్నారు.
ఘనంగా వందో పుట్టిన రోజు వేడుక
బెళుగుప్ప: మండల కేంద్రానికి చెందిన దివంగత మాజీ సర్పంచ్ పాటిల్ తిప్పారెడ్డి సతీమణి పాటిల్ తిమ్మమ్మ వందేళ్ల పుట్టిన రోజు వేడుకను ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, డీసీసీ అధ్యక్షులు వై.మధుసూదన్‌రెడ్డి హాజరై తిమ్మమ్మను సత్కరించారు. రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై న పాటిల్ తిప్పారెడ్డి సతీమణి అయిన తిమ్మమ్మకు ఐదు మంది కుమారులు సంతానం కాగా కోడళ్లు, మనుమలు, మనుమరాల్లు, మునిమనవలు కలిపి సుమారు 50 మంది దాకా కుటుంబ సభ్యులు ఉన్నారు. తమ తల్లి వంద సంవత్సరాల వయస్సున్నా నేటికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ ఏనాడూ ఆస్పత్రి వైపు చూడకుండా సంతోషంగా ఉన్నారని కుమారులు పాటిల్ నాగిరెడ్డి, పాటిల్ శ్రీనివాసరెడ్డి, పాటిల్ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు.


