● ఘనంగా ప్రారంభమైన
అమ్మవారి బ్రహ్మోత్సవాలు
● నేడు బ్రహ్మ రథోత్సవం
రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి మూల విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహం వద్ద అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ చేసి కలశ స్థాపన చేశారు. రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టిన అనంతరం ప్రధాన ఆలయం ప్రాంగణంలో పట్టం కూర్చోబెట్టారు. మధ్యరాత్రి సమీపాన గల పాలబావి వద్దకు మేళతాళాలతో చేరుకున్నారు. పాలబావిలో ఉత్సవ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం కట్టి, పూలు, పండ్లు ఉంచి హారతిచ్చిన తర్వాత నైవేద్యంగా బావిలోకి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తే సంతాన భాగ్యం, యువతులకు పెళ్లిళ్లు, ధీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో అమ్మవారిని కొలిచేందుకు మహిళలు తండోప తండాలుగా తరలివచ్చారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేడు బ్రహ్మరథోత్సవం..
కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మ రథోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, కై వాడస్తులు తెలిపారు.


