ఊరికో పేరు.. పూటకో మోసం | - | Sakshi
Sakshi News home page

ఊరికో పేరు.. పూటకో మోసం

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

బొమ్మనహాళ్‌: గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త చిన్న ఓబులేసు ఘరానా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో చోట ఒక్కో పేరుతో చలామణి అవుతూ సాగించిన మోసాలను ప్రజలు పసిగట్టలేకపోయారు. రోజుల వ్యవధిలోనే రూ. లక్షకు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి కొన్ని రోజుల పాటు ఠంఛన్‌గా సొమ్ము చెల్లించేవాడు. ఆ తర్వాత రూ. కోట్లలో వసూలు చేసుకుని పెట్టెబేడా సర్దుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవాడు. ఇప్పటికే కణేకల్లు, ఆత్మకూరు, నంద్యాల జిల్లా అవుకు, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మోసాలకు పాల్పడిన ఓబులేసు... తాజాగా బొమ్మనహాళ్‌ పీఎస్‌ పరిధిలోని ఉద్దేహాళ్‌లో మహేష్‌రెడ్డి పేరుతో రూ.1.50 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. గత ఆరేళ్లలో రూ.20 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

గతంలో భాస్కర్‌రెడ్డిగా... మహేష్‌రెడ్డిగా

2022 మే లో నంద్యాల జిల్లా అవుకులో భాస్కర్‌రెడ్డిగా పరిచయమైన ఓబులేసు అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని వంటనూనె, చక్కెర, సిగరెట్ల వ్యాపారమంటూ స్థానికులను నమ్మించి సుమారు రూ.3 కోట్ల వరకూ మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు అవుకు పోలీసులు గాలించి అన్నమయ్య జిల్లా గాలివీడులో పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అనంతరం బయటకు వచ్చిన ఓబులేసు 2023 జనవరిలో శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో షేర్‌ మార్కెట్‌ వ్యాపారమంటూ సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతకు ముందు కణేకల్లుతో పాటు ఆత్మకూరులోనూ రూ. 4 కోట్ల వరకూ జనాలను మోసం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామానికి చేరుకున్న ఓబులేసు... మహేష్‌రెడ్డి పేరుతో ఓ అద్దె ఇంట్లో దిగాడు. అద్దె కారును తన సొంత వాహనమని చెప్పుకుంటూ తిరిగేవాడు. సిగరెట్లు, చక్కెర ఎగుమతి..దిగుమతి వ్యాపారం చేస్తున్నానంటూ అందరినీ నమ్మించాడు. తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే రూ.లక్షకు రూ. 3 వేలు చొప్పున వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి, పది మందితో సుమారు రూ. 1.50 కోట్లను వసూలు చేసుకుని పరారయ్యాడు. ఈ క్రమంలో మాయమాటలతో గొర్రెల కాపరులను బురిడీ కొట్టించి వంద జీవాలను తీసుకెళ్లాడు. బాధితులందరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 29న ఓబులేసుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే ఉద్దేహాళ్‌ గ్రామంలో రూ.1.50 కోట్ల మోసానికి సంబంధించి ఒక్క రూపాయిని కూడా నిందితుడి నుంచి పోలీసులు రికవరీ చేయకపోవడం గమనార్హం.

ప్రజల అత్యాశే పెట్టుబడి

ఒక్కో చోట ఒక్కో పేరుతో చలామణి

వేషాలు మార్చి.. మోసాలకు తెగబడి

ఓబులేసు, మహేష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చక్కరరెడ్డి.. పేరు ఏదైనా మనిషి మాత్రం ఒక్కడే. తాను ఎక్కడికెళ్లినా కొత్త పేరు పెట్టుకోవడం అతని నైజం. తనను నమ్మిన వారిని నట్టేట ముంచి జెండా ఎత్తేయడం అతని హాబీ. ఎక్కడ పాగా వేసినా రూ.కోట్లలోనే కుచ్చు టోపీ పెట్టడం అతని వృత్తి. పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన ఈ ఘరానా కేటుగాడు ఇప్పటికే పలుమార్లు పోలీసులకు పట్టుబడి రిమాండ్‌కు వెళ్లి వచ్చాడు. అయినా మార్పు రాలేదు. తాజా మోసాలతో మరోసారి రాయదుర్గం పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement