గుత్తి రూరల్: మండలంలోని ఊటకల్లు వద్ద శనివారం ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. ఘటనలో ఓ విద్యార్థి గాయపడగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్‌ఎస్‌లోని చంద్రప్రియ నగర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకుంటున్న కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని విద్యార్థుల కోసం యాజమాన్యం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో శనివారం తొలుత కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఉప్పరపల్లి, రొళ్లపాడు తండా తదితర గ్రామాల నుంచి పిల్లలను ఎక్కించుకుంటూ గుత్తి మండలం ఊటకల్లు విద్యార్థుల కోసం బస్సు బయలుదేరింది. ఊటకల్లు గ్రామ శివారుకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న కుక్కలను గమనించగానే బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. రొళ్లపాడు తండాకు చెందిన జెనిధర్ (4వ తరగతి) గాయపడ్డాడు. మరో విద్యార్థితో పాటు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఇరుకున్న మరో ఇద్దరు విద్యార్థులను డ్రైవర్ సాయంతో స్థానికులు వెలికి తీశారు. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గాడితప్పిన ‘ఖజానా’
● ముడుపులిస్తేనే బిల్లులకు మోక్షం
● ఉద్యోగుల మధ్య అంతర్గత పోరు
● ఒక అధికారిపై ఫిర్యాదు చేస్తూ 18 లేఖలు
● ఉమ్మడి జిల్లా ఖజానా శాఖలోని ఓ అధికారి తీరుపై అదే శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అది కూడా ఏకంగా 18 రకాల ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాసినట్లు చర్చ సాగుతోంది.
● ఓ ఉద్యోగి రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఈయన భూముల విక్రయాలకు సంబంధించిన వ్యాపారం జోరుగా చేస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.
● ఓ అధికారికి శాఖలోని ఒకరిద్దరు ఉద్యోగులు రెస్టారెంట్లు, ధాబాల్లో విందు ఇస్తున్నట్లు కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఒక ధాబాలో పార్టీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విందులతో తమ పనులు చేయించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలోని కీలక శాఖల్లో ఖజానా శాఖ ఒకటి. అయితే ఈ శాఖలో ఉద్యోగుల పనితీరు గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక అధికారి పనితీరుపై రాష్ట్రస్థాయి అధికారులకు ఒకరిద్దరు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారంటే పరిస్థితి ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కొందరు ఉద్యోగులు అవినీతి దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముడుపులు ముట్టచెబితేగానీ వీరు బిల్లుల పాస్ చేయరనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడి ఉద్యోగుల్లో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఒక అధికారికి రెస్టారెంట్లు, ధాబాల్లో విందులు ఇవ్వడం నిత్యకృత్యమయ్యింది.
బజారున శాఖ పరువు
ఖజానా శాఖ ఉద్యోగుల మధ్య అంతర్గత పోరు తారస్థాయిలో ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటూ శాఖ పరువు బజారున వేస్తున్నారంటూ కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఒక ముఖ్య అధికారి పనితీరుపై విమర్శలు ఉన్నాయి. ఖజానా శాఖ పనితీరుపై అనంతపురం కలెక్టర్ ఆనంద్ దృష్టిసారించి దారిలో పెట్టాలనే అభిప్రాయాలు ఉద్యోగుల నుంచి కూడా వస్తుండడం గమనార్హం.
అందుబాటులో ఉండకుండా..
ఉద్యోగి తనకు కేటాయించిన సీటులో ఉంటూ విధులు నిర్వర్తించాలి. అయితే టెక్నికల్ విధులు నిర్వర్తించే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎప్పుడూ తన సీట్‌లో అందుబాటులో ఉండరని తెలిసింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీట్‌లో ఆయన లేకపోవడంతో ఊసురోమంటూ వెనక్కు వెళుతున్నారు. ఈ విషయంపై శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్యను అడిగితే ఆ ఉద్యోగిని తన చాంబర్‌లో ఉంచుకుని పనిచేయిస్తున్నానని వివరణ ఇచ్చారు.


