పుట్టపర్తి అర్బన్: రైతులకు బిందు, తుంపర సేద్యం పరికరాలను అందించడంలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలో రెండవ స్థానాన్ని జిల్లా దక్కించుకుందని ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్ తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రోత్సాహాన్ని మరువలేమన్నారు. కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది సమష్టి సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 14 వేల హెక్టార్ల లక్ష్యానికి గాను 11,866 మంది రైతులకు 14,297 హెక్టార్లకు మెటీరియల్ అందించినట్లు తెలిపారు. ఆరుగురు రైతులకు ఆటోమెషిన్ మంజూరు చేసినట్లు వివరించారు.
కల్వర్టులోకి దూసుకెళ్లిన బైక్
● ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు
● ఇద్దరి పరిస్థితి విషమం
బత్తలపల్లి: కల్వర్టులోకి ద్విచక్ర వాహనం దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం నగరానికి చెందిన కుంటాల అభినయ్, సాత్విక్, వరుణ్.. నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. శనివారం ముదిగుబ్బ మండలం కన్యకలగొందికి వెళ్లిన ముగ్గురు అక్కడ వివాహ వేడుక చూసుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. బత్తలపల్లి మండలం గుమ్మల్లకుంట వద్దకు రాగానే వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని మోరీలోకి దూసుకెళ్లింది. వాహనంతో పాటు ముగ్గురూ మోరీలోకి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్ష/తగాత్రులను వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కాగా, సాత్విక్, వరుణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పెన్నహోబిలం
ఆలయ ఈఓగా రమేష్‌బాబు
ఉరవకొండ: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈఓగా సాకే రమేష్‌బాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ ఆలయానికి ఇన్‌చార్జ్ ఈఓగా తిరుమలరెడ్డి కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆలయానికి రెగ్యులర్ ఈఓగా రమేష్‌బాబును నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆలయంలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమానికి తిరుమలరెడ్డి తన కుమార్తె దీక్షితా రెడ్డి పేరుపై రూ.10 వేలు విరాళాన్ని ఈఓ రమేష్‌బాబుకు అందజేశారు.
పిచ్చికుక్క దాడిలో
పలువురికి గాయాలు
ఉరవకొండ: మేజర్ పంచాయతీ ఉరవకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి చిన్నారులు, పెద్దలు సహా 13 మందిని గాయపరిచింది. శనివారం సత్యనారాయణపేట, వడ్డే వీధిలోకి వచ్చిన పిచ్చికుక్క కనిపించిన వారిపై దాడి చేసింది. రెడ్డికృష్ణ, మణికంఠ, సంజయ్, వన్నూర్‌స్వామి, ప్రేమ్, కృష్ణమూర్తి, నారాయణస్వామి, లక్ష్మి, ప్రభావతమ్మ, గోపి, మానస, సంజీవ, ప్రభాకర్ గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే కాలనీవాసులు పంచాయతీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.


