పెనుకొండ రూరల్: ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఇంటికి చేరుకున్న నవజాత శిశువు మృతి చెందింది. పెనుకొండ మండలం గుట్టూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... గుట్టూరుకు చెందిన గర్భిణి స్నేహిలతకు 20 రోజుల క్రితం పురిటి నొప్పులు మొదలు కాగానే కుటుంబసభ్యులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రసవం అనంతరం పండంటి మగబిడ్డతో నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి స్నేహలత చేరుకుంది. శనివారం ఉదయం ఉన్నఫళంగా నవజాతి శిశువు ముక్కు నుంచి రక్త స్రావం కావడంతో. కుటుంబ సభ్యులు గుట్టూరులోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి సిబ్బంది సూచన మేరకు పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిశువు అచేతనంగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అందించడంలో గుట్టూరు సీహెచ్‌సీ సిబ్బంది విఫలమయ్యారంటూ శిశువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గుట్టూరు సీహెచ్‌సీ డాక్టర్ నాగరాజు నాయక్ మాట్లాడుతూ.. నవజాత శిశువు బరువు తక్కువగా ఉన్న కారణంగా 15 రోజులకు పైగా అనంతపురంలోని సర్వజనాస్పత్రిలోనే చికిత్స చేశారన్నారు. గుట్టూరు సీహెచ్‌సీలో చిన్నపిల్లల వైద్య నిపుణుడు లేకపోవడంతో పెనుకొండకు తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారన్నారు.
పీటీ వారెంట్‌పై ఇద్దరి అరెస్ట్
హిందూపురం: ఓ కేసులో పట్టుబడి జైలులో ఉన్న ఇద్దరిని శనివారం హిందూపురం పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. వివరాలు... హిందూపురంలోని త్యాగరాజ నగర్‌కు చెందిన కాల ప్రవీణ్, నాగేంద్ర.. ఈ ఏడాది జనవరిలో గంజాయి కేసులో పట్టుబడి అనంతపురంలోని సబ్‌జైలులో ఖైదీలుగా ఉంటున్నారు. ఈ కేసులో న్యాయస్థానంలో వారిని హాజరు పరచాల్సి ఉండడంతో పీటీ వారెంట్ కింద ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి, హిందూపురానికి పిలుచుకువచ్చారు. శనివారం న్యాయస్థానంలో హాజరు పరిచిన అనంతరం తిరిగి సబ్‌జైలుకు తరలించారు.


