
క్రికెట్ విజేత జట్టుని ట్రోఫీని అందజేస్తున్న డీజీపీ బి.సయ్యద్ మహమ్మద్ యాసిన్,చిత్రంలో మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి
కేరళ మాజీ డీజీపీ సయ్యద్ మహమ్మద్ యాసిన్
మడకశిర రూరల్: స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ శ్రీరామరెడ్డి స్ఫూర్తిని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు కేరళ మాజీ డీజీపీ బి.సయ్యద్‌మహమ్మద్ యాసిన్ పిలుపునిచ్చారు. మడకశిర మండలం నీలకంఠాపురంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శ్రీరామరెడ్డి 120వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీరామరెడ్డి సమాధికి శ్రీరామరెడ్డి, రఘువీరారెడ్డి కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు నివాళులర్పించారు.
అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మాజీ డీజీపీ మాట్లాడారు. శ్రీరామరెడ్డి సాగించిన ఉద్యమాలను కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీరామరెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నీని నీలకంఠాపురం జట్టు కైవసం చేసుకుంది. రన్నర్స్‌గా రొళ్లలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల జట్టు నిలిచింది. విజేత జట్లను అభినందిస్తూ ట్రోఫీలను మాజీ డీజీపీ ప్రదానం చేశారు. అలాగే పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు, ఉత్తమ రైతులకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి, శ్రీరామరెడ్డి కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, సేవామందిరం విద్యాసంస్థల అధినేత కేటీ శ్రీధర్, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, రైతులు పాల్గొన్నారు.