
పంతానికి పోయి ప్రాణమే తీశారు..!
అనంతపురం సెంట్రల్: ఊపిరి పోస్తారనుకున్న వారు ఆయువే తీశారు. గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేశారు. మహిళా,శిశు సంక్షేమశాఖ పరిధి లోని శిశుగృహలో నవజాత శిశువు ఆకలితో మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించారు. దీంతో మహిళా,శిశు సంక్షేమశాఖ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం రాత్రి జిల్లాకు వచ్చారు. ఎస్పీ జగదీష్‌కు కూడా విచారణ బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై సమగ్ర విచారణకు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి, ఐసీడీఎస్ పీడీ నాగమణి, సర్వజనాసుపత్రి చిన్నపిల్లల వైద్యులు ప్రవీణ్ సభ్యులుగా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం కమిటీ సభ్యులు శిశుగృహలో విచారణ చేపట్టారు.
అనుమానాలెన్నో..
అనారోగ్యంతో నవజాత శిశువు మృతి చెందాడని శిశుగృహ సిబ్బంది చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 20 రోజుల క్రితం కళ్యాణదుర్గం వద్ద ముళ్ల పొదల్లో శిశువు దొరికాడు. ఆస్పత్రిలో చికిత్సల అనంతరం ఆరోగ్యం మెరుగవడంతో శిశుగృహకు రెఫర్ చేశారు. ఈ క్రమంలో మళ్లీ అనారోగ్యం పాలైతే ప్రభుత్వాసుపత్రిలో ఎందుకు చేర్పించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగా, ఇటీవల శిశుగృహలో పనిచేసే ఇద్దరు ఆయాలు గొడవపడినట్లు తెలి సింది. ఈ క్రమంలో శుక్రవారం ఒకరు విధులకు రాలేదు. దీంతో మరో ఆయా ఆక్రోశంతో పిల్లలను పట్టించుకోలేదు. అప్పుడు ఐదుగురు ఆడ శిశువులు, ఒక మగశిశువు ఉన్నాడు. పాలు పట్టించకపోవడంతో పిల్లాడు ఏడ్చి ఏడ్చి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా మారింది. అర్ధరాత్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, విషయం బయటకు పొక్కితే మేనేజర్, సోషల్‌వర్కర్, ఏఎన్‌ఎం, ఆయాలకు ఇబ్బంది వస్తుందని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసినట్లు తెలుస్తోంది.
తెరవెనుక మంత్రాంగం
శిశువు మృతికి కారణమైన వారిని పక్కన పెట్టి సెలవు పెట్టిన ఆయాపై చర్యలు తీసుకొని మమ అనిపించేందుకు కొంతమంది తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. శుక్రవారం విధుల్లో ఉన్న ఆయాపై చాలా ఆరోపణలు ఉండడం గమనార్హం. గతంలో పసికందులను గిచ్చడం, గోర్లతో రక్కి గాయపరచడం వివాదాస్పదమైంది.
అవినీతి మరకలు..
శిశుగృహలో పనిచేస్తున్న సిబ్బంది అందరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో దత్తత కోసం వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళను ప్రస్తుత మేనేజర్ డబ్బు డిమాండ్ చేయడం.. దీంతో ఎన్‌ఆర్‌ఐ ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేయడం.. అప్పటి కేంద్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి ఆదేశాలతో కలెక్టర్ వీరపాండియన్ మేనేజర్‌ను ఏకంగా విధుల నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. అయితే కోర్టు ఆదేశాలతో తిరిగి ఆమె అదే ఉద్యోగంలో కొలువు దీరడం గమనార్హం. అలాగే సోషల్ వర్కర్ కూడా హిందూపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళను బంగారు గొలుసు కోసం డిమాండ్ చేసి నగరంలో ఓ నగల దుకాణంలోకి తీసుకెళ్లడంతో బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను వన్‌స్టాప్ సెంటర్‌కు బదిలీ చేయగా.. ఓ అధికారిణిని ప్రసన్నం చేసుకొని మళ్లీ శిశుగృహకు వచ్చారనే విమర్శలు ఉన్నాయి.
అందరికీ మెమోలు
తప్పు చేసిన వారిపై చర్యలు ఉంటాయి. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చిన్నపిల్లలు ఉన్న చోట తరచూ గొడవ పడుతుంటే ఏం చేస్తున్నావని మేనేజర్‌తో సహా ఆరుగురు సిబ్బందికి మెమోలు ఇచ్చాను. – నాగమణి, పీడీ, ఐసీడీఎస్
తీవ్ర చర్చనీయాంశమైన
శిశుగృహలో బాలుడి మృతి
సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు
గతంలోనూ వివాదాస్పదం
కలెక్టర్ దృష్టి సారిస్తేనే అన్నీ కొలిక్కి
నవమాసాలు మోసి జన్మనిచ్చినా గంటల వ్యవధిలోనే కాదనుకొని ముళ్ల పొదల్లో పడేశావు. ఈ భూమిపై జీవించే ప్రాప్తం లేదని అనుకున్నా.. అధికారులు వచ్చి అక్కున చేర్చుకున్నారు. శిశుగృహకు తీసుకువస్తే బతకనిస్తారు అని భావించా. ఇక్కడ చూస్తే గ్రూపులతో నాకు పాలు కూడా పట్టలేదు. ఎంత ఏడ్చినా వినిపించుకునే నాథుడు లేరు. ఏడ్చి.. ఏడ్చి నా ప్రాణం పోయింది. ఎందుకమ్మా నాకు ఇలాంటి జన్మనిచ్చావు.
– శిశుగృహలో ఆకలితో అలమటించి మృత్యువాత పడిన చిన్నారి ఆక్రందన ఇది.

పంతానికి పోయి ప్రాణమే తీశారు..!