
సీఐ శేఖర్‌ను సస్పెండ్ చేయాలి
గోరంట్ల: విధి నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరించడమే కాక శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన గోరంట్ల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ బోయ శేఖర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఐగా బాధ్యతలు చేపటినప్పటి నుంచి అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ, అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణను గాలికి వదిలేశారన్నారు. మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళా హోంగార్డు ప్రియాంక తనను క్యాబ్ డ్రైవర్లు మొయినుద్దీన్, షఫి వేధించారని ఫిర్యాదు చేసినా సీఐ పట్టించుకోలేదన్నారు. పైగా వేధింపులకు గురిచేసిన క్యాబ్ డ్రైవర్లకే వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు. గత నెలలో అధికార పార్టీ మాజీ సర్పంచ్, మంత్రి సవిత ప్రధాన అనుచరుడు ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. సీఐ అండదండలతో ఆ మాజీ సర్పంచ్ అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారని గుర్తు చేశారు. భూ సమస్య విషయంలో సీఐ వేధింపులు భరించలేక పెనుకొండకు చెందిన ఆర్టీసీ మాజీ ఉద్యోగి అయిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సీఐ వ్యవహారశైలిపై నూతన ఎస్పీ దృష్టికి ఫిర్యాదు చేస్తామన్నారు.
మహిళా హోంగార్డ్‌ను వేధించిన క్యాబ్‌డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షరాలు ఉషశ్రీచరణ్