సాక్షి టాస్క్‌ఫోర్స్: పుణ్యక్షేత్రమైన అశ్వత్థంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అలజడి సృష్టించారు. ఆలయ ఆవరణలో ఉన్నఫళంగా రాళ్ల కుప్పలు ప్రత్యక్షం కావడం పెద్దపప్పూరు మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది. వివరాలు... పెద్దపప్పూరు మండల అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు రామిరెడ్డి బొందలదిన్నె గ్రామంలో ఆదివారం విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించారు. విందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నారని ప్రచారం జరగడంతో తాడిపత్రి నుంచి బొందలదిన్నె మార్గ మధ్యలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అశ్వత్థంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఒక్క సారిగా అశ్వత్థం క్షేత్రంలో అలజడి రేగింది. ఇదే క్రమంలో ఆలయ ఆవరణలోని పెన్నానది ఒడ్డున రాళ్లకుప్పలు కనిపించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. విందు కార్యక్రమానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లలేదని తెలియడంతో జేసీ వెనుదిరగడం గమనార్హం.
అశ్వత్థంలో జేసీ అలజడి