
అనధికార పశువధశాలల గుట్టురట్టు
హిందూపురం: అనధికారిక పశువధశాలల గుట్టు రట్టయ్యింది. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి పశువులను గోశాలకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. హిందూపురానికి చెందిన కొంతమంది వ్యాపారులు మోతుకుపల్లిలో అక్రమంగా పశువధశాలలు నిర్వహిస్తున్నారు. పశువుల మాంసం విక్రయించడంతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రంగంలోకి దిగారు. మున్సిపల్ అధికారులతో కలిసి అనధికారిక పశువధశాలలపై దాడి చేశారు. అక్కడ వధించడానికి పెద్ద సంఖ్యలో ఉంచిన ఎద్దులు, ఆవులు, దూడలను గుర్తించారు. పోలీసులను మోహరించి... ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 87 పశువులను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఎస్పీ మహేష్, సీఐలు రాజగోపాల్‌నాయుడు, జనార్దన్, అబ్దుల్ కరీం పశువులను ఉంచిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ పేర్చి ఉన్న పశువుల చర్మం, నిల్వ ఉంచిన మాంసం గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్ల క్రితం అనధికారిక వధశాలలను తొలగించామన్నారు. అయినా వ్యాపారులు గుట్టుగా మళ్లీ వధ శాలలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారన్నారు. ఏపీ ప్రొహిబిషన్ యాక్ట్ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977 ప్రకారం ఏదైనా పశువును వధించాలంటే వ్యవసాయానికి, పాల ఉత్పత్తికి, సంతానోత్పత్తికి సరికాదని అన్ని పరీక్షలు చేసి నిర్థారించిన తర్వాతే వైద్య పరీక్షలతో అధికార అనుమతితో ధ్రువీకరణ చేసి వధించాల్సి ఉంటుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి పశువులను, వాటి పిల్లలను ఇలా తెచ్చి కట్టి వధించడం నేరమన్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను గోశాలకు పంపామన్నారు. పట్టుబడిన పశువులు ఉన్న ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీటిని వధించి వ్యాపారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో అనధికారికంగా వధశాలలు నిర్వహిస్తూ జంతువ్యర్థాలు అక్కడే పడవేస్తూ అనారోగ్యం పాలు చేస్తున్నారని ఎవరైనా అభ్యంతరం తెలిపితే నిర్వాహకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేస్తారని స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు.
అనధికార పశు వధశాలలను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, సీఐలు
పశువులను వధించడానికి ఏర్పాటు చేసిన షెడ్లు
పోలీసులు, మున్సిపల్ అధికారుల
ఆకస్మిక దాడి
సీజ్ చేసిన పశువులను గోశాలకు
తరలింపు

అనధికార పశువధశాలల గుట్టురట్టు