
లైంగికంగా వేధిస్తున్నాడనే హత్య
● వీడిన యువకుడి అనుమానాస్పద మృతి మిస్టరీ
● ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
నల్లచెరువు: అల్లుగుండు గ్రామానికి చెందిన అమర్‌నాథ్ (24) అనుమానాస్పద మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహితను లైంగికంగా వేధిస్తుండటంతో ఆమె భర్త, మరో ఇద్దరి సహకారంతో అమర్‌నాథ్‌ను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐ నాగేంద్ర మీడియాకు వెల్లడించారు. అల్లుగుండు గ్రామానికి చెందిన షేక్ దాదాపీర్, అమర్‌నాథ్ స్నేహితులు. ఈ క్రమంలో దాదాపీర్ తరచూ అమర్‌నాథ్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఓ రోజు దాదాపీర్ ఇంట్లో లేని సమయంలో అమర్‌నాథ్ వచ్చాడు. అప్పుడు ఆమె బాత్రూమ్‌లో ఉండగా.. అమర్‌నాథ్ సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అనంతరం తన కోరిక తీర్చాలని, లేకుంటే వీడియో అందరికీ పంపుతానని బ్లాక్‌మేల్ చేశాడు. భార్య ద్వారా విషయం తెలుసుకున్న దాదాపీర్ తన స్నేహితులైన కుమ్మరవాండ్లపల్లికి చెందిన సాదిక్‌బాషా, కదిరికి చెందిన మహమ్మద్ యాసిన్‌లకు చెప్పి.. అమర్‌నాథ్ ను ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు. పథకం ప్రకారం జూన్ పదో తేదీ రాత్రి 11 గంటల సమయంలో మాట్లాడాలని బాలప్పగారి పల్లి వద్దనున్న గుట్టవద్దకు ఆటోలో తీసుకెళ్లారు. అక్కడ అమర్‌నాథ్‌ను రాళ్లతో కొట్టి అతి హతమార్చారు. అనంతరం తాడుతో కాళ్లకు బండరాయి కట్టి తవళంమర్రి పంచాయతీ పరిధిలోని రిజర్వాయర్ కాలువ నీటిలో పడేసి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితులను పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇక తమను వదలరని గ్రహించిన ముగ్గురు నిందితులు దాదాపీర్(ఏ1), మహమ్మద్ యాసిన్ (ఏ2), సాదిక్‌బాషా(ఏ3), శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఏ ఒక్క హామీ అమలు చేయలేదు
కదిరి అర్బన్: అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సకాలంలో డీఏలు, పీఆర్‌సీ నియమించి మధ్యంతర భృతి ఇస్తామని తదితర హామీల్లో ఏ ఒక్కటీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఫ్యాప్టో చైర్మన్ గజ్జల హరిప్రసాద్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ గౌస్‌లాజమ్ ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 7న విజయవాడలోని ధర్నా చౌక్‌లో వేలాదిమంది ఉపాధ్యాయులతో చేపట్టే ధర్నాకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విడతల వారీగా ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని, బోధనేతర పనులు రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమిత్తం చేస్తామని చెప్పి ఇంతవరకూ చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో మెమో 57 అమలులో మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు జవహర్, ఆంజనేయులు, రమేష్, ఆదిబయన్న, రాజశేఖర్, నారాయణ, తాహిర్‌వలీ, హనీఫ్‌ఖాన్, వెంకటేష్‌బాబు, చాంద్‌బాషా, షర్పుద్దీన్, మౌలాలి, వెంకటాచలమయ్య, హతావుల్లా, ఈదుల్లా, శ్రీనివాసులు, రఘునాథరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లైంగికంగా వేధిస్తున్నాడనే హత్య