
నంది విగ్రహం చోరీ కేసు ఛేదింపు
చెన్నేకొత్తపల్లి: ముష్టికోవెల వద్ద ఉన్న పురాతన శివాలయంలోని నంది విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విగ్రహం ఎత్తుకువెళ్లిన గుప్తనిధుల వేటగాళ్లలో నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ శనివారం చెన్నేకొత్త పల్లిలోని రామగిరి సర్కిల్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా బడవనహళ్లికి చెందిన మధుసూదన్, న్యూ ఎస్టేట్‌కు చెందిన దీపక్‌శెట్టి, చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలూకా తుమకూర్లహళ్లికి చెందిన భానుపసాద్, తుమకూరు జిల్లా చేలూరుహోబ్లి తాలూకా సి.హరివేసాండ్రాకు చెందిన చందన్‌తో పాటు మరికొందరు గుప్తనిధుల వేటగాళ్లు. వీరు గుప్త నిధుల కోసం సెప్టెంబర్ నాలుగో తేదీ ముష్టికోవెల వద్ద ఉన్న శివాలయంలోని నంది విగ్రహాన్ని చోరీ చేశారు. బొలెరో వాహనంలో విగ్రహాన్ని తుమకూరు జిల్లా పావగడ తాలూకా వీర్లగుడి గ్రామ సమీపంలో ఉన్న మారెమ్మగుడి వద్ద ఉన్న బావి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నంది విగ్రహం ముఖం, గోపురం, వెనుక తోక భాగం పగులగొట్టారు. చోరీ ఘటనకు సంబంధించి గ్రామస్తుడు ఈశ్వరప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం న్యామద్దెల సమీపంలోని బుల్లెట్ కంపెనీ వద్ద నలుగురు నిందితులు మధుసూదన్, దీపక్‌శెట్టి, భానుప్రసాద్, చందన్ ఉన్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సత్యనారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా.. నేరం ఒప్పుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ తెలిపారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కేసును ఛేదించిన పీఎస్‌ఐ గౌతమి, పోలీసులు పోతన్న శ్రీరాములు, సంజీవరాయుడు, షాకీర్, దస్తగిరి, నవీన్‌ను డీఎస్పీ అభినందించారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఏవైనా ఘటనలు జరిగినపుడు నిందితులను త్వరగా పట్టుకునేందుకు వీలవుతుందని డీఎస్పీ ప్రజలకు సూచించారు.
నలుగురు గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్