
కనుల పండువగా జాతర
ఉత్సవంలో పాల్గొన్న భక్తులు
ప్రత్యేక అలంకరణలో త్రిశక్తి అమ్మాజీ దేవతలు
రొళ్ల: మండలంలోని జీరిగేపల్లిలో వెలసిన త్రిశక్తి అమ్మాజీ దేవతల జాతర శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. వేకువజామునే ఆలయంలో మారక్క, గ్యారక్క, ముడుపక్క, కంబదముత్తక్క దేవత మూర్తుల మూల విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి వెండి, బంగారు ఆభరణాలతో పాటు భక్తులు కానుక రూపంలో తీసుకువచ్చిన పట్టువస్త్రాలతో అలంకరించారు. ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో పాలబావి వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి గంగా జలంతో అభిషేకించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఊయాల స్తంభం వద్ద పట్టంపై కూర్చో బెట్టారు. పలువురు భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దాతల సహకారంతో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో అమ్మాజీ ధర్మ ప్రచార సేవ పరిషత్ ట్రస్ట్ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కనుల పండువగా జాతర