
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం
● సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక
పుట్టపర్తి: తమ సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఓబిరెడ్డి హెచ్చరించారు. ఈ నెల 12న విజయవాడలో తలపెట్టిన దశాబ్ద ఐక్యత భవిష్యత్తు పోరాట సభ పోస్టర్లను శుక్రవారం కొత్తచెరువు మండల రీసోర్స్ కార్యాలయ ఆవరణలో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. గత 20 ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో ఎంతో ప్రాధాన్యత ఉన్న సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వరప్రసాద్, భాస్కర్, శ్రీలత, హేమలత, రామమోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువకుడిపై కేసు నమోదు
ధర్మవరం అర్బన్: బాలికను వేధింపులకు గురి చేయడమే కాక ఆమె తల్లిపై దాడి చేసినందుకు ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ధర్మవరం మున్సిపాల్టీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు 16 సంవత్సరాలుగా బెంగళూరులో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే యువకుడు గత రెండేళ్లుగా బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. బుధవారం రాత్రి బాలిక చెయ్యి పట్టుకుని తన కోరిక తీర్చాలంటూ బెదిరింపులకు దిగాడు. విషయాన్ని బాలిక ద్వారా తెలుసుకున్న తల్లి నేరుగా వెళ్లి ఈశ్వర్‌ను నిలదీయడంతో అతను చెయ్యి చేసుకున్నాడు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో బోల్తా.. వృద్ధుడి మృతి
కనగానపల్లి: మండలంలోని చంద్రాచెర్ల సమీపంలో ఆటో బోల్తా పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... గురువారం సాయంత్రం మామిళ్లపల్లి నుంచి చంద్రాచెర్లకు వెళ్తున్న ఆటో 44వ జాతీయ రహదారి దాటిన తర్వాత మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న చంద్రాచెర్లకు చెందిన పెద్దన్న (80) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడటంతో వారిని ధర్మవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం