
బాబా శత జయంతిని వైభవంగా చేద్దాం
ప్రశాంతి నిలయం: సమష్టి కృషితో సత్యసాయి శత జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. బాబా శత జయంత్యుత్సవాలకు దేశవిదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సత్యసాయి శత జయంతి వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ పుట్టపర్తిలోని కీలక ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత ప్రశాంతి నిలయంలోని గణేష్ గేట్, సాయికుల్వంత్ సభా మందిరం, శాంతిభవన్, వెస్ట్‌గేట్‌లను వారు పరిశీలించారు. ప్రముఖులు, విదేశీ భక్తులు, ప్రజలకు మందిరంలోకి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా మార్గాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం చిత్రావతి బ్రిడ్జి కూడలి, హారతి ఘాట్, ఏపీఐఐసీ ఇండసీ్ట్రయల్ పార్కు వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించి ప్రముఖులు, వీవీఐపీల రాకపోకలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియం, ప్రైమరీ పాఠశాల, శ్రీనివాస గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాలను పరిశీలించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
పుట్టపర్తి టౌన్: పచ్చని పుట్టపర్తిని ఆవిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఆటవీశాఖ ఆధ్వర్యంలో పోలీస్‌పరేడ్ మైదానంలో ‘వనం– మనం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లా అధికారులు, ప్రజలు వారి పరిధిలోని ఖాళీ స్థలంలో మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. ప్రస్తుతం 15 లక్షలు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన వారు ఆధార్‌కార్డ్ సమర్పించి మొక్కలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపు