
వీరభద్రుని సేవలో కలెక్టర్, ఎస్పీ
లేపాక్షి: దసరా పండుగ సందర్భంగా గురువారం కలెక్టర్ శ్యాంప్రసాద్ దంపతులు, ఎస్పీ సతీష్‌కుమార్ దంపతులు లేపాక్షి వీరభద్రుని సేవలో గడిపారు. ఉదయం ఎస్పీ, సాయంత్రం కలెక్టర్ దంపతులు ఆలయానికి విచ్చేయగా, ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయంలోని దుర్గాదేవి అమ్మవారికి, వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులను అడిగి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. వారి వెంట ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, ఎస్‌ఐ మునీర్ అహమ్మద్, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో
పలువురికి చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో జిల్లాకు చెందిన పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లుగా మడకశిర నియోజకవర్గానికి చెందిన హెచ్‌బీ నర్సేగౌడ, వైటీ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ ఎం.తిప్పేస్వామిలను నియమించారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్‌ఈసీ) మెంబర్లుగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, కదిరి నియోజకవర్గానికి చెందిన అత్తార్ చాంద్‌బాషా, బత్తల హరిప్రసాద్‌కు అవకాశం కల్పించారు.
జయంత్యుత్సవాలకు
ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడపనున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. అందులో భాగంగా యశ్వంతపూర్–హిందూపురం (06518/19) ప్యాసింజరును ఈ నెల 20 నుంచి 26 వరకు గుంతకల్లు జంక్షన్ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే బెంగళూరు–ధర్మవరం మధ్య మరో ప్యాసింజర్ రైలు (06595/96) ఈ నెల 20 నుంచి 26 వరకు నడపనున్నట్లు వెల్లడించారు.

వీరభద్రుని సేవలో కలెక్టర్, ఎస్పీ