
అందని పశు వైద్యం
పుట్టపర్తి టౌన్: స్థానిక ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం పాడి ఆవును తీసుకొచ్చిన రైతు ఇబ్బంది పడ్డాడు. పశువైద్యశాలలో ఏడీ సుధానిధి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఈశ్వర్‌నాయక్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడీ సుధానిధి ఇటీవలే బదిలీపై ఇక్కడకు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే బుధవారం ఏడీ, ఎల్‌ఎస్‌ఓ ఇద్దరూ ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరయ్యారు. అదే సమయంలో చుట్టు పక్కల గ్రామాల నుంచి పశువులను చికిత్స కోసం తొలుకొచ్చిన రైతులు ఉదయం 8 నుంచి 11గంటల వరకూ పడిగాపులు కాశారు. చివరకు సిబ్బంది అందించిన నామమాత్రపు వైద్యంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు.