
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు
పెనుకొండ రూరల్: విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో తులతూగాలని ఆకాక్షించారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని చేపట్టిన ప్రతి పనీ విజయవంతం కావాలని కోరుకున్నారు.
ప్రతిరైతూ ఈ–క్రాప్
చేయించుకోవాలి
చెన్నేకొత్తపల్లి: పంటసాగు చేసిన ప్రతి రైతూ తప్పనిసరిగా ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేయించాలని జిల్లా వ్యవసాయాధికారి రాము నాయక్ సూచించారు. బుధవారం మండల వ్యవసాయాధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్యాదిండి గ్రామంలో ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి రాము నాయక్ మాట్లాడుతూ... ఈ–క్రాప్ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించబోవన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాలపై జీఎస్టీ తగ్గించిందని, దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. పంటలసాగులో యూరియాకు బదులుగా సేంద్రియ ఎరువులు వాడాలన్నారు. కార్యక్రమంలో ధర్మవరం ఏడీ లక్ష్మానాయక్, పలువురు రైతులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
తండ్రి పోషణ బాధ్యత పిల్లలదే
● కుమార్తెలకూ ఈ నిబంధన వర్తిస్తుంది
● ఇద్దరు బిడ్డలు నెలకు రూ.10 వేలు తండ్రికి ఇవ్వాలని ఆర్డీఓ తీర్పు
ధర్మవరం అర్బన్: పెంచి పెద్దచేసి, చదివించి, వివాహాలు చేసిన తండ్రి వృద్ధాప్యంలో ఉండగా పట్టించుకోని ఇద్దరు కుమార్తెలకు ధర్మవరం ఆర్డీఓ మహేష్ గుణపాఠంలాంటి తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని సాయినగర్‌లో నివసిస్తున్న చారుగుండ్ల అహోబులప్ప(62)కు ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇద్దరికీ విద్యాబుద్ధులు నేర్పించి వివాహాలు చేశాడు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోవడంతో అహోబులప్పను పట్టించుకునే వారు కరువయ్యారు. వృద్ధాప్యంతో ఏ పనీ చేసుకోలేని పరిస్థితుల్లో కుమార్తెల వైపు ఆశగా చూసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆయన తనకు న్యాయం చేయాలని ధర్మవరం ఆర్డీఓను కోరారు. ఈ కేసును మానవత్వంతో విచారించిన ఆర్డీఓ మహేష్... వృద్ధుడైన అహోబులప్ప ఆర్థిక, వైద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు కుమార్తెలు నెలకు రూ.10 వేలు (ఒక్కో కుమార్తె రూ.5 వేల చొప్పున) తండ్రి జీవనోపాధి, వైద్య ఖర్చుల కోసం చెల్లించాలని తీర్పునిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కాపీని అహోబులప్పకు అందించారు. వయో వృద్ధులు ఎవరైనా సరే ఏదైనా సమస్య ఎదుర్కొంటుంటే తనను సంప్రదించాలని సూచించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కుమారులతో పాటూ కుమార్తెలకూ ఉంటుందని ఆర్డీఓ స్పష్టం చేశారు.
‘పురం’ వాసికి
అంతర్జాతీయ ఫిడే రేటింగ్
హిందూపురం టౌన్: గత నెల 21న బెంగళూరు వేదికగా జరిగిన నాల్గవ చెక్ అండ్ మేట్ ఆల్ ఇండియా ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీలో హిందూపురానికి చెందిన విద్యార్థిని భవ్య సహస్ర ఉత్తమ ప్రతిభతో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ 1,427ను దక్కించుకుంది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఈ రేటింగ్ ఉపయోగపడుతుందని కోచ్ ఆరీఫ్‌వుల్లా తెలిపారు. ప్రతిభ చాటిన భ్య సహస్రను ఆయన అభినందించారు. అంతర్జాతీయ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కావడమే తన లక్ష్యమని భవ్య సహస్ర తెలిపారు.

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు