
కదులుతున్న కారుపై మందుబాబు హల్‌చల్
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతి గ్రాం వద్ద ఓ యువకుడు పూటుగా మద్యం సేవించి కదులుతున్న కారుపై పడుకుని హల్‌చల్ చేశాడు. కొంత దూరం వెళ్లిన తరువాత కారు ఓ గోడను ఢీ కొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి గానీ, పైన పడుకున్న మందుబాబుకు గానీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. సోమవారం జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ప్రశాంతి నిలయం జోన్‌లోని ప్రశాంతిగ్రాంలోనే వైన్‌షాపు తెరిచారు. ఇక్కడ యువకులు మద్యం తాగుతూ హల్‌చల్ చేస్తున్నారు. సత్యసాయి నడయాడిన పుట్టపర్తి పవిత్రతను దెబ్బతీస్తున్నారు. పైగా జిల్లా పోలీస్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.