
రైలు ఢీకొని వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: రైలు ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. జీఆర్పీ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన మేరకు... 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి కొన్ని రోజులుగా సీకే పల్లి మండలం బసంపల్లి గ్రామంలో తిరుగుతూ ఉండే వాడన్నారు. మంగళవారం రాత్రి బసంపల్లి నుంచి కనుముక్కల వైపు వెళ్లే దారిలో పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొంది. ఘటనలో దూరంగా ఎగిరి పడిన వ్యక్తి శరీర అవయవాలు తెగి పడ్డాయి. లోకో పైలెట్ ఇచ్చిన సమాచారంతో జీఆర్పీ కానిస్టేబుల్ ఎర్రిస్వామి బసంపల్లికి చేరుకుని స్థానికుల సాయంతో ఘటనాస్థలాన్ని గుర్తించాడు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ పట్టుబడిన ఆర్టీసీ డ్రైవర్
అనంతపురం: కర్ణాటక నుంచి ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ ఎకై ్సజ్ అధికారులకు ఓ ఆర్టీసీ డ్రైవర్ పట్టుబడ్డాడు. వివరాలను అనంతపురం ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి వస్తున్న ఆర్టీసీ అనంతపురంలోని ధర్మవరం రోడ్డులో ఉన్న శివకోటి ఆలయం వద్ద ఆపి తనిఖీ చేశారు. సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణిస్తున్న శివకోటి ఆలయం వద్ద నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ పి.ఓబులనారాయణరెడ్డి వద్ద నుంచి 60 ఆర్మీ ఫుల్ బాటిళ్ల మద్యం పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అదే బస్సులో ముందు వైపు కూర్చొన్న పాత నిందితులు సాకే పవన్‌కుమార్, వడే శ్రీనివాసులు వెంటనే బస్సు దిగి పారిపోయారు. బెంగళూరులోని ఆర్టీ క్యాంటీన్ నుంచి మద్యం కొనుగోలు చేసి జిల్లాకు అక్రమంగా చేరవేస్తున్నట్లుగా విచారణలో వెలుగు చూసింది. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్‌ఐలు జాకీర్ హుస్సేన్, జయ నరసింహ, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
తాగుడుకు డబ్బివ్వలేదని కొడవలితో దాడి
అనంతపురం: మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదంటూ సొంత మేనమామ కొడుకుపైనే కొడవలితో దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం గ్రామ సింగిల్ విండో ప్రెసిడెంట్ చాకలి కేశన్న మంగళవారం సాయంత్రం అనంతపురంలోని పాతూరు జంగాలపల్లి మసీదు వద్ద ఉన్న సమయంలో మేనత్త కుమారుడు సుబ్బారావు కలసి మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రోజూ తాగుడుకు డబ్బు కావాలంటూ దౌర్జన్యం చేయడం సరికాదని కేశన్న సర్దిచెప్పబోతుండగా కొడవలితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు కేకలు వేయడంతో సుబ్బారావు అక్కడి నుంచి పారిపోయాడు. క్షతగాత్రుడు స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరూ టీడీపీకి చెందిన వారే కావడం, పైగా సమీప బంధువులు కావడంతో దాడిని రాజీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

రైలు ఢీకొని వ్యక్తి మృతి