
10న మెగా జాబ్ మేళా
హిందూపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన హిందూపురంలోని ఎస్‌డీజీఎస్ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్రకుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 15 బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ, నర్సింగ్ / ఎనీ డిగ్రీ, ఎనీ బి.టెక్, పీజీ చదివి 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు. అభ్యర్థులు కచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్, ఆధార్ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో రావాలని, మరిన్ని వివరాలకు 96767 06976 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత వాతావరణశాఖ, విశాఖ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 1న 0.4 మి.మీ, 2న 0.2 మి.మీ, 3న 2.4 మి.మీ, 4న 5.5 మి.మీ, 5న 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీల నుంచి 32.7 డిగ్రీలు, రాత్రిళ్లు 22.8 డిగ్రీల నుంచి 23.2 డిగ్రీల మధ్య ఉండొచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 79 నుంచి 82, మధ్యాహ్నం 43 నుంచి 60 శాతం మధ్య రికార్డు కావొచ్చన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు.
అరటి చెట్టుకు రెండు గెలలు
పుట్లూరు: సాధారణంగా అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే వస్తుంది. అయితే ఇందుకు భిన్నంగా పుట్లూరు మండలం రంగరాజుకుంట గ్రామానికి చెందిన రైతు పొన్నపాటి హనుమంతురెడ్డి తోటలో ఒక చెట్టుకు రెండు గెలలు వచ్చాయి. నాలుగు ఎకరాల్లో అరటి పంటను సాగు చేయగా రెండవ పంటలో ఇలా ఒక చెట్టుకు మాత్రమే రెండు గెలలు వచ్చిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలా రెండు గెలలు రావడం ఎన్నడూ చూడలేదని స్థానిక రైతులు చెబుతున్నారు. కాగా, అరటి మొక్క కాండంలో రెండవ శిరోజం ఏర్పడినప్పుడు ఇలా రెండు గెలలు వస్తాయని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
పర్యాటకులపై తేనెటీగల దాడి
తాడిపత్రి టౌన్: నియోజకవర్గంలోని యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలో ఉన్న వాటర్ పాల్స్ వద్ద పర్యాటకులపై మంగళవారం తేనెటీగలు దాడి చేసాయి. తాడిపత్రి పట్టణానికి చెందిన ఉదయ్‌కిరణ్, పృథ్వీరాజ్ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. దసరా పండుగకు తాడిపత్రికి వచ్చి కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం కోన వాటర్ పాల్స్ చూసేందుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో తేనెటీగలు దాడి చేసాయి. హుటాహుటిన పిల్లలను వాహనంలో ఎక్కించుకుని దూరంగా రావడంతో పెనుప్రమాదం తప్పంది. ఉదయ్‌కుమార్, పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.