
అసాంఘికశక్తుల ఆట కట్టించాల్సిందే
కదిరి: శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అసాంఘిక శక్తుల ఆట కట్టించాలని ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కదిరి డీఎస్పీ కార్యాలయంతో పాటు రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతిటివారైనా సరే.. ఉపేక్షించవద్దని సూచించారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలియజేశారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తారని, అలాంటి వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని.. ఈ విషయంలో తేడా వస్తే క్షమించేది లేదన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి పోలీస్ అధికారీ పల్లె నిద్ర చేసినప్పుడే ప్రజలకు పోలీసుల పట్ల మరింత గౌరవం పెరుగుతుందని, అప్పుడే ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా పోలీసుల దృష్టికి తీసుకొస్తారని తెలియజేశారు. బాల్య వివాహాలు, సైబర్ మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు.
సీసీ కెమెరాలుండేలా చూడండి
పట్టణాల్లోని అపార్ట్‌మెంట్‌లు, దుకాణాలు, ప్రార్థనామందిరాల వద్ద కచ్చితంగా సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలపై కూడా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. దొంగతనాలు జరగక్కుండా రాత్రి సమయాల్లో గస్తీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని దిశానిర్దేశం చేశారు. అంతకుమునుపు కదిరి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, శాంతిభద్రతల సమస్యలపై డీఎస్పీ శివనారాయణస్వామిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టణ పోలీస్ స్టేషన్‌లోని లాకప్ గదులు, మహిళా హెల్ప్‌డెస్క్, పట్టుబడిన ద్విచక్ర వాహనాలతో పాటు స్టేషన్ ప్రాంగణం మొత్తం కలియదిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో సీఐలు నారాయణరెడ్డి, నాగేంద్ర, నిరంజన్‌రెడ్డి, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్