
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
ధర్మవరం రూరల్: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందిని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. ధర్మవరం మండలం దర్శనమల పీహెచ్‌సీని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వన్నప్ప, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’ మూక దాడి
– నలుగురుకి తీవ్ర గాయాలు
ధర్మవరం రూరల్: మండలంలోని ముచ్చురామి గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు తారస్థాయికి చేరుకున్నాయి. పొలానికి రస్తా విషయంగా గొడవపడి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు... ముచ్చురామి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పెద్ద ఫక్కీరప్ప, టీడీపీ నేత క్రిష్టయ్య మధ్య పొలాలకు వెళ్లే రస్తా విషయంగా కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. పలుమార్లు ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఇదే విషయంగా మంగళవారం రాత్రి పెద్ద ఫక్కీరప్ప, గంటా నరసింహులు, అతని కుమారుడు నందకుమార్, ప్రణీష్‌కుమార్‌పై టీడీపీ నాయకులు క్రిష్టయ్య, బాలచంద్ర, రవికుమార్, రామాంజి కట్టెలతో దాడికి తెగబడ్డారు. స్థానికులు అడ్డుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ధర్మవరం రూరల్ పోలీసులు తెలిపారు.