
సకాలంలో వైద్యం అందక యువకుడి మృతి
తనకల్లు: ప్రమాదంలో గాయపడిన యువకుడిని గోల్డెన్ అవర్‌లోనే ఆస్పత్రికి చేర్చినా.. సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. వివరాలు.. ఎన్‌పీ కుంట మండలం ఎదురుదొన గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ (21) తన భార్య లలితకుమారితో కలసి మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా పెద్దపాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. తనకల్లు మండలం చీకటిమానిపల్లి సమీపంలో ఉన్న కేకే ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే ఎదురుగా దూసుకొచ్చిన కంటైనర్ ఢీకొంది. నవీనకుమార్‌కు తీవ్ర గాయాలు కాగా, లలితకుమారి కాలికి బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్సులో గోల్డెన్ అవర్‌లోనే క్షతగాత్రులను తనకల్లులోని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. చికిత్స అందేలోపు నవీన్‌కుమార్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం లలిత కుమారిని కదిరికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.
వైద్యులు అందుబాటులో లేరంటూ ఆందోళన
స్థానిక ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రికి సకాలంలో నవీన్‌కుమార్‌ను చేర్చినా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మృతి చెందాడంటూ కొక్కంటి క్రాస్‌కు చెందిన పలువురు యువకులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రికి చేరుకుంటున్న క్షతగాత్రులకు సకాలంలో వైద్యసేవలు అందించాల్సిన వైద్యులు పత్తాలేకుండా పోతున్నారని మండిపడ్డారు. ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నా... అత్యవసర సమయంలో ఏ ఒక్కరూ అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గోపి అక్కడకు చేరుకుని నిరసనకారులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు.