
డిమాండ్ల సాధనకు ఉద్యమాలే శరణ్యం
పింఛన్ల పంపిణీ సజావుగా సాగేనా?
● రేపటి నుంచి పింఛన్ల పంపిణీ
పుట్టపర్తి అర్బన్: సచివాలయ సిబ్బంది నిరసనలు, ధర్నాలతో పాటు ఇటీవల సమ్మె నోటీసులు ఇవ్వడంతో ఈ సారి పింఛన్ల పంపిణీ సజావుగా సాగే పరిస్థితులు కనిపించడం లేదు. అక్టోబర్ 1వ తేదీన పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంది. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఈ నెల 26న కమిషనర్‌కు వినతి పత్రం ఇస్తూ ఇంటింటికీ తిరిగి పింఛన్లు అందజేయబోమని జేఏసీ సభ్యులు తేల్చి చెప్పారు. అలాగే 27న కలెక్టర్‌ను కలసి పింఛన్ పంపిణీ చేయబోమని విన్నవించారు. ఈ క్రమంలో 29న పింఛన్ నగదును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయకుండా నిరాకరించారు. 30న వివిధ ప్రసార మాద్యమాల ద్వారా పింఛన్ పంపిణీ చేయబోమని లబ్ధిదారులకు విషయాన్ని చేరవేయనున్నట్లు జేఏసీ సభ్యులు తెలిపారు. 1వ తేదీన అధికారులు పింఛన్ మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులకు అందజేస్తే బుధవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయాల వద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే జరిగితే జిల్లాలోని 2,63,987 మంది పింఛన్ లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవు. కాగా, జిల్లాలోని లబ్ధిదారులకు 1వ తేదీన పింఛన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మొత్తాన్ని అక్టోబర్ 1వ తేదీ, 3వ తేదీ మాత్రమే పంపిణీ చేస్తామన్నారు. 2వ తేదీ గాంధీ జయంతి, దసరా పండుగల సందర్భంగా పంపిణీ ప్రక్రియ ఉండదన్నారు.
ఆటో నుంచి కింద పడి వివాహిత మృతి
రొద్దం: ఆటో నుంచి కింద పడి ఓ వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ పోతన్న భార్య నందిని(30) వ్యవసాయ కూలి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచింది. ఈ క్రమంలో ఆర్.లోచెర్ల గ్రామానికి చెందిన ఆటోలో గ్రామంలో సహ కూలీలతో కలసి ఉదయం 7 గంటలకు బయలుదేని మోపుర్లపల్లిలో కూలి పనులు ముగించుకుని తిరిగి అదే ఆటోలో ఇంటికి చేరుకునేది. ఈ క్రమంలో సోమవారం ఉదయం పనులకు ఆటోలో బయల్దేరిన ఆమె డ్రైవర్ పక్కన సీటులో కూర్చొని ప్రయాణిస్తోంది. సుబ్బరాయప్ప కొట్టాల వద్దకు చేరుకోగానే డ్రైవర్ అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో పట్టు తప్పి కిందపడడంతో తలకు లోతైన గాయమైంది. స్థానికులు వెంటనే రొద్దంలోని పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పుట్టపర్తి: ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్సనర్ల సమస్యల పరిష్కారంపై పాలకుల్లో కదలిక రావాలంటే ఉద్యమాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లు రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం కొత్తచెరువులోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జరిగింది. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ గజ్జల హరిప్రసాదరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులుగా హాజరైన రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి విద్యాశాఖలో 72, 73, 74 జీఓలు అమలు చేయాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలన్నారు. కేంద్ర మెమో 57ను అమలుపరుస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించి వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలు, సంపాదిత సెలవు బిల్లులు విడుదల చేయాలన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలన్నారు. డిమాండ్ల సాధనకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో అక్టోబర్ 7న విజయవాడలో తలపెట్టిన ‘చలో విజయవాడ–పోరుబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.చంద్ర, బడా హరిప్రసాదరెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కోనంకి చంద్రశేఖర్, షమీవుల్లా, జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శి గోపాల్, రామకృష్ణ, గోపాల్ నాయక్, మాధవ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
మల్లు రఘునాథరెడ్డి

డిమాండ్ల సాధనకు ఉద్యమాలే శరణ్యం