
హత్య కేసు దర్యాప్తులో అన్యాయం
పుట్టపర్తి టౌన్: తమ కుమారుడిని ముగ్గురు కలసి హతమారిస్తే విచారణను పెడదోవ పట్టించి కోడలిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన ఇద్దరిని స్వేచ్ఛగా వదిలేశారంటూ హతుడి తల్లిదండ్రులు మంగమ్మబాయి, నారాయణనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీపీఓలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ సతీష్‌కుమార్‌ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుట్టపర్తి మున్సిపాల్టీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో ఉన్న జగన్న కాలనీలో నివాసం ఉంటున్న తమ కుమారుడు బాలాజీ నాయక్‌ను ఈ నెల 15న దారుణంగా హతమార్చారన్నారు. భార్య గాయత్రి బాయితో పాటు మహమ్మద్ అలీ, అంజీనాయక్ తమ కుమారుడిని హతమార్చినట్లుగా అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఘటనపై పుట్టపర్తి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి, గాయత్రీబాయితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారన్నారు. అయితే హంతకులతో డబ్బు తీసుకుని దర్యాప్తును పెడదోవ పట్టించి గాయత్రీబాయిని మాత్రమే హంతకురాలిగా నిర్ధారిస్తూ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారని, మిగిలిన ఇద్దరినీ స్వేచ్ఛగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోతైన విచారణ చేపట్టి తమ కుమారుడిని హతమార్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా కఠిన శిక్ష పడేలా చేయాలని ఎస్పీకి విన్నవించామన్నారు. స్పందించిన ఎస్పీ.. లోతైన విచారణ చేపట్టి న్యాయం చేయాలంటూ పుట్టపర్తి పోలీసులను ఆదేశించారన్నారు.
వివిధ సమస్యలపై 70 వినతులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
హతుడి తల్లిదండ్రుల ఆవేదన
న్యాయం చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు
పరిష్కార వేదికకు 70 వినతులు