
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరించాలి
బత్తలపల్లి: పేదల పెన్నిధిగా ఉన్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రిని స్థానిక సీపీఐ నేతలతో కలసి సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలపై రోగులతో ఆరా తీశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 56 సంవత్సరాలుగా వివిధ రంగాలలో ఆర్డీటీ అందిస్తున్న సేవలను కొనియాడారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్న ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా అడ్డుకోవడం బాధాకరమన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్డీటీ అందించిన సేవలు మరువలేమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో చర్చించి ఆర్డీటీకి ఎప్‌సీఆర్‌ఏ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.
కేంద్రం దృష్టికి టీచర్ల సమస్యలు
పుట్టపర్తి అర్బన్: టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లను మినహాయించే అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళుతానని రామకృష్ణ పేర్కొన్నారు. పుట్టపర్తికి విచ్చేసిన ఆయనను ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. టీచర్ల సర్వీస్ రూల్స్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎస్టీయూ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, గోపాల్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ