
శిథిలాలు మీదపడి కార్మికుడి మృతి
ఓడీచెరువు (అమడగూరు): పాత ఇంటిని తొలగిస్తుండగా శిథిలాల మీద పడి ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందాడు. అమడగూరు మండలం ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన మంజుల వెంకటరమణ (70) కూలీ పనులతో జీవనం సాగిస్తున్నాడు. తన స్వగ్రామంలో ఓ పాత ఇంటిని తొలగించే పనిలో నిమగ్నమై ఉండగా... ప్రమాదవశాత్తు గోడ కూలి మీద పడింది. కుటుంబసభ్యులు వెంటనే ప్రైవేట్ వాహనంలో కదిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
యువకుడి దుర్మరణం
రొళ్ల: మండల పరిధిలోని 544ఈ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు... రొళ్ల మండలం మళ్లసముద్రానికి చెందిన అశోక్ (25) ఉపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లాడు. సోమవారం బెంగళూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మరోవైపు పావగడ నుంచి కర్ణాటక రాష్ట్రం కడూరుకు కోళ్ల లోడ్‌తో ఐచర్ వాహనం వెళ్తోంది. అయితే గుడిబండకు వెళ్లే నాలుగు రోడ్ల కూడలి వద్ద అశోక్ ద్విచక్ర వాహనంలో రోడ్డు దాటుతుండగా అటు నుంచి వచ్చిన ఐచర్ వాహనం ఢీ కొని బోల్తాపడింది. అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏఎస్‌ఐ హిదాయతుల్లా దర్యాప్తు చేపట్టారు.

శిథిలాలు మీదపడి కార్మికుడి మృతి