
మడకశిరలో విషాదం
● ఈతకెళ్లి ఇద్దరు యువకుల మృతి
మడకశిర: నియోజకవర్గ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. శుభకార్యానికి వచ్చిన ఇద్దరు యువకులు ఈత కెళ్లి నీట మునిగి మృతి చెందారు. వివరాలు... కర్ణాటకలోని హాజన్‌కు చెందిన బాబ్జాన్ (34), మున్వర్ (23) వారి బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఆదివారం మడకశిరకు వచ్చారు. సోమవారం బంధువులందరూ కలసి సరదాగా చెరువు ప్రాంతానికి సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. కాసేపటి తర్వాత అందరూ బయటకు వచ్చినా.. బాబ్జాన్, మున్వర్ మాత్రం రాలేదు. దీంతో బంధువులకు అనుమానం వచ్చి స్విమ్మింగ్ పూల్‌లో గాలింపు చేపట్టారు. పూల్ కింద భాగంలో యువకులద్దరూ ఇరుక్కుపోయినట్లుగా గుర్తించి విషయాన్ని వెంటనే స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులకు తెలపడంతో వారు నీటిలో దిగి బాబ్జాన్, మున్వర్‌ను వెలికి తీశారు. అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించిన బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. స్విమ్మింగ్ పూల్‌లో అధికంగా పాచి కట్టి ఉండడంతో ఇద్దరు యువకులు అందులో ఇరుక్కుపోయి మృతి చెందినట్లుగా మృతుల బంధువులు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, బాబ్జాన్‌కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మున్వర్‌కు వివాహం కాలేదు.